కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో జనవరి 16 నుంచి అతి పెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. అందులో భాగంగానే ఇప్పటికే 30 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలి దశలో మొత్తం 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే తొలి దశను ఏప్రిల్ నెలాఖరు వరకు ముగించాలని కేంద్రం ఇటీవలే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఏప్రిల్ నెలాఖరు వరకు తొలి దశ వ్యాక్సినేషన్ పూర్తయితే మే నెల మొదటి వారం నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా 50 ఏళ్లకు పైబడిన వారితోపాటు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తారు. ఈ దశలో మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది. అయితే వ్యాక్సిన్ పంపిణీ వరకు బాగానే ఉంది కానీ అప్పటి వరకు వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలు అనుకున్న స్థాయిలో వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేస్తాయా, లేదా అన్నది సందేహంగా మారింది.
అయితే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియకు తొలి విడతలో తక్కువ మంది ఉన్నారు కనుక వ్యాక్సినేషన్ సెంటర్లను కూడా తక్కువగానే ఉపయోగిస్తున్నారు. కానీ రెండో విడతలో అధిక శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కనుక అప్పటి వరకు ఆ కేంద్రాల సంఖ్యను కూడా పెంచాల్సి వస్తుంది. అలాగే కోవిన్ యాప్‌లో అనేక లోపాలు ఉన్నాయి కనుక అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ యాప్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా జరుగుతుంది.