ఒక పక్క తెలుగుదేశం పార్టీ అమరావతి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ముఖ్యమంత్రి జగన్ ని ఎదుర్కోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగానే శ్రమిస్తున్నారు అయినా సరే ఫలితం మాత్రం కనపడటం లేదు. కేంద్రం మద్దతు కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నా ఉపయోగం ఉండటం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.
రాజకీయంగా ఈ పరిణామం చంద్రబాబుకి పెద్ద ఇబ్బందిగా మారింది. అయితే ఈ తరుణంలో చంద్రబాబుకి కీలక నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. తాజాగా మరో కీలక నేత పార్టీ వీడెందుకు సిద్దమయ్యారు. కడప జిల్లా కమలాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలోనే వైసీపీ కండువా కప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.
గత ఎన్నికల్లో కమలాపురం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన ఆయనకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామని అన్నారు. అయితే పార్టీ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా కమలాపురం మండలం కోగటం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఏర్పాటుకు, నూతన భవన నిర్మాణాల కోసం,
భూమి పూజ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, డిసీసీబీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి ఘనస్వాగతం పలకడం జిల్లాలో చర్చనీయంశంగా మారింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. ఆయన పార్టీని వీడితే జిల్లాలో పార్టీ తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని అంటున్నారు.