సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను వేధిస్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వెలుగుచూసింది. ఓ విద్యాలయంలో 6 నుంచి 12 తరగతుల వరకు కేవలం విద్యార్థినులే అభ్యసిస్తుంటారు. సీనియర్ల వేధింపుల సమస్య కారణంగా గురువారం ఓ విద్యార్థిని టీసీ తీసుకోవడంతో విషయం బయటకు వచ్చింది. కొందరు జూనియర్లు తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం విద్యాలయానికి వచ్చి ఉపాధ్యాయినులతో గొడవకు దిగారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి చెందిన పలువురు విద్యార్థినులు తమను ఇబ్బంది పెడుతున్నారని తల్లిదండ్రులు, విలేకరుల ముందే ఉపాధ్యాయినులతో చెప్పారు. 9, 10, 11 తరగతుల బాలికలు మాట్లాడుతూ సీనియర్లు తమను గదుల్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వివరించారు. చెల్లిగా ఉండాలంటూనే ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఓ విద్యార్థిని సీనియర్ రాసిన ప్రేమ లేఖను చూపారు.
ప్రిన్సిపల్ స్పందిస్తూ.. సమస్య ఈ రోజే తన దృష్టికి వచ్చిందన్నారు. సీనియర్ల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడుతానని, సమస్యను పరిష్కరిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు.
ఇద్దరు ఉపాధ్యాయినులు నిత్యం విద్యార్థినులతో పాటే వసతి గృహాల్లో బస చేస్తున్నా వేధింపుల విషయం గ్రహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆ విద్యాలయాల సెక్టోరియల్ అధికారిని ఉన్నతాధికారులు ఆదేశించారు.