జనగాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.జిల్లాలోని కొడకండ్ల మండలం మైథం చెరువు తండా గ్రామపంచాయతీ పరిధిలోని సూర్యాపేట, జనగాం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామస్తులు పేరాల వెంకన్న(45), పేరాల జ్యోతి(35) తమ సొంత గ్రామం నుంచి కడవెండికి వెళ్తున్నారు.
వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం డ్రైవర్‌కు పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించలేదు. దీంతో డీసీఎం వెనుక భాగంలో వేగంగా తుఫాన్ వాహనం ఢీ కొనగా వెంకన్న, జ్యోతి ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.క్షతగాత్రులను జనగామ ప్రధాన ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.వారికి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.