ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా.. మరో ఆరు నెలల్లో అందుబాటులోకి..

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ.. పలు దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో వాటిని ఎదుర్కొనే టీకాలను అభివృద్ధి చేయడం అనివార్యమవుతోంది. ఈ క్రమంలోనే ఒమిక్రాన్​ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ కూడా ప్రత్యేకంగా ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకాను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. వచ్చే ఆరు నెలల్లోపే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ తీసుకురానున్నట్లు ఆ సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణమని నివేదికలు వస్తోన్న వేళ.. సీరం చీఫ్‌ ఈ మేరకు మాట్లాడారు.
‘భారత్‌లో బూస్టర్‌ డోసుగా గతంలో తీసుకున్న టీకాలే ఇస్తున్నారు. అయితే, ఒమిక్రాన్‌పై పోరాడే వ్యాక్సిన్‌ కోసం నోవావాక్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.5పై సమర్థంగా పోరాడే వ్యాక్సిన్‌ను ఆరు నెలల్లోపే తీసుకువస్తాం. బూస్టర్‌గా ఈ వ్యాక్సిన్‌ ఎంతో మేలు చేస్తుంది’ అని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనావాలా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version