దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య సోమవారం 110కి పైగానే చేరుకున్న విషయం విదితమే. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇక మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు 37 మందికి కరోనా ఉన్నట్లు నిర్దారించారు. కాగా సోమవారం సాయంత్రం మహారాష్ట్రలోని పలు ఆలయ కమిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆయా ఆలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా వైరస్ నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు ఆలయాలను మూసివేశారు. ముంబైలోని అతి ప్రాచీనమైన సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్టు తెలిపింది. తదుపరి ప్రకటన తాము వెల్లడించేవరకు ఆలయం మూసే ఉంటుందని ట్రస్టు సభ్యులు తెలిపారు. అలాగే మహారాష్ట్రలోని తుల్జా భవాని ఆలయాన్ని మార్చి 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ రెండు ఆలయాలకు నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో తాజా ప్రకటనతో ఈ ఆలయాలు వెలవెలబోనున్నాయి.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలోనే జన సమూహాలను నివారించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు ఒకే చోట పెద్ద ఎత్తున గూమికూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.