తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి మరియు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో కేటీఆర్‌ని సీఎంగా చూడబోతున్నామంటూ ఆ పార్టీ నాయకులు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తవగానే యాదాద్రిలో సుదర్శన యాగం, ఛంఢీ యాగం, రాజశ్యామల యాగం చెయ్యనున్నాడని, ఈ సమయంలో కేటీఆర్ సీఎం పనులు పర్యవేక్షిస్తాడని తెలుస్తుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ సీఎం అవ్వొచ్చంటూ లీకులిస్తున్నారు.
ఇక కేటీఆర్ సీఎం అయితే ఆయనకు విశ్వసనీయులైన కొందరిని మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్లు వినవస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వంటి నాయకులు ఇప్పటి నుండే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక బాల్క సుమన్‌కి పక్కాగా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు అవకాశం రాకుండా ఉన్న వారికి, యువకులకు పెద్దపీఠ వేయనున్నట్లు విశ్లేషణలు చేస్తున్నారు.
కుత్బుల్లాపూర్ యువ నాయకుడు, యువకుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు పక్కాగా మంత్రి పదవి రావటం ఖాయమంటున్నారు ఆయన అనుచరులు.. టీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టినప్పటినుండి పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన శంభీపూర్ రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు కేసీఆర్ . సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు కూడా. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ పరిధిలో అన్ని స్థానాలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. కేసీఆర్‌ని కానీ, కేటీఆర్‌ని కానీ కలవాలంటే అందరికీ అపాయింట్‌మెంట్ కావాలేమో కానీ శంభీపూర్ రాజు మాత్రం నేరుగా వెళ్లగలిగేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ అంశాలు ఎమ్మెల్సీసీకి కలిసిరావడంతోపాటు, ప్రజలకు దగ్గరగా ఉండటం, బీసీ నాయకుడు కావడం అదనపు బలం.
రాజకీయ విశ్లేషణలు, ఊహాగానాలను పక్కన పెడితే.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు శంభీపూర్ రాజు మినిస్టర్ అనే మాటను నిజం చేసేలా ఉన్నాయి. వివాదాలకు దూరంగా, ప్రెస్‌మీట్ల జోలికి పోకుండా ఉండే శంభీపూర్ రాజు ఉన్నట్లుండి మీడియాలో హడావిడి చేయడం చూస్తుంటే ఆయన మంత్రి కాబోతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.