వీరప్పన్’ దేశం మొత్తం ఈ పేరు అందరికి సుపరిచితమే అయినా… మూడు రాష్ట్రాలకు మాత్రం కంటి మీద కునుకు ఉండేది కాదు. దశాబ్దాల పాటు సత్యమంగళం అడవిని తన గుప్పిట్లో పెట్టుకుని, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వాలకు చుక్కలు చూపించాడు. అతని మీసాలు చూస్తే చాలు పోలీసులు కూడా భయపడే వారు. అంతర్జాతీయ స్థాయిలో అతని పేరు మారుమోగిపోయింది.
అతను చనిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు అతనికి సంభందించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. వీరప్పన్ హతమైన 15 ఏళ్ల తర్వాత అతని ఫ్రెండ్ ని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేరు స్టెల్లా మేరీ కాగా వయసు 40 ఏళ్ళు. 27 ఏళ్ళుగా ఆమె తప్పించుకుని తిరుగుతుంది. అంటే 13 ఏళ్ళకే వీరప్పన్ గ్యాంగ్ లో చేరింది. ఆదివారం ఆమెను చామరాజనగర్ జిల్లాలోని జాగెరి గ్రామంలో కోల్లెగళ్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసారు.
1993 నుంచి ఆమె పరారీలో ఉందని, ఆమెపై ‘టాడా’ చట్టాన్ని ప్రయోగించినట్టు మీడియాకు వివరించారు. కర్ణాటకలో ఏనుగుల హడావుడి ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలోనే తన చెరుకు పొలంలో ఏనుగులు ఉండటంతో వాటిని తరమడానికి తుపాకి పేల్చగా పోలీసులు అరెస్ట్ చేసి తుపాకి ఎలా కాల్చడం వచ్చని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనకు వీరప్పన్ గ్యాంగ్ తో సంబధాలు ఉన్నాయని ఆమె ఒప్పుకుంది.