టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఓవైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు ఈ వ్యవహారంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రజాప్రతినిధుల పని పడుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుంటే ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దర్యాప్తునకు ఆధారాలు ఉపయోగపడతాయని బండి సంజయ్‌కు ఇచ్చిన నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న బండి సంజయ్ నివాసంలో నోటీసులు ఇచ్చారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 50 మందికి పైగా అభ్యర్థులకు 100 మార్కులు దాటాయని బండి సంజయ్ ఇటీవల ఆరోపించారు. ఈ విషయంలో సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి.. 24వ తేదీన హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సైతం సిట్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. 23వ తేదీన ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.