సమయం ఆదా చేయడం, ఖర్చులను తగ్గించడం కోసం బెంగళూరు వినూత్న ఆలోచన చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ‘ఎస్‌ఎంఎస్ నోటీసుల’ జారీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. నగరంలో ప్రతి రోజు 20వేల ఎస్‌ఎంస్ నోటీసులు జారీ చేస్తున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) రవిన్‌కాంతే గౌడ్ తెలిపారు. గతంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులకు నోటీసులు జారీ చేసే వారిమని తెలిపారు. ఇందుకోసం ఒక్కో నోటీసు ప్రింటింగ్, పోస్టల్ చార్జీలు కలిపి రూ.4.50వరకు ఖర్చు అయ్యేదని తెలిపారు.
ఒకవేళ వాహనదారుడు నోటీసును తీసుకోకపోతే, ట్రాఫిక్ పోలీసు వాహన యజమానిని వెతికి పట్టుకుని, నోటీసు అందజేసేవారని తెలిపారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నామని, నోటీసులు జారీ చేసే బాధ్యత కూడా ఉండటంతో నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కష్టతరంగా మారిందని చెప్పారు.
వాహన రిజిస్ట్రేషన్ సమయంలో యజమాని తన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి, ఆర్‌టీఓ ఆఫీస్ నుంచి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహన యజమాని నెంబర్‌ను పోలీసులు తిరిగి పొందుతారు. పైగా ఎస్‌ఎంఎస్ నోటీసు 20 పైసలు మాత్రమే ఖర్చవుతున్నది. దీనివల్ల సమయం, డబ్బు రెండు కూడా ఆదా అవుతాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) రవిన్‌కాంతే గౌడ్ వివరించారు.