కేంద్రం అనుమతి లేకుండానే ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు డైరెక్టర్లే డైరెక్ట్ గా అమ్మేయవచ్చు : మోడీ నిర్ణయం
ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి ఉంచి, సంబంధిత ఉద్యోగ వర్గాల జీవితాలను రోడ్డున పడేస్తున్నారన్న విమర్శ ఒకటి కేంద్రంపై ఉంది. విలువయిన ఆస్తులున్నా సరే ! వాటిని అమ్మి అయినా సరే ! ఓపెన్ ఆక్షన్ ద్వారా 4 రూపాయలు సంపాదించి అయినా సరే ! సంస్థలను నిలబెట్టాల్సిన మోడీ, ఇందుకు భిన్నంగా కార్పొరేట్ శక్తులకు దాసోహం అయిపోతున్నారని ఇప్పటికే ఎన్నో సార్లు కమ్యూనిస్టులు రోడ్డెక్కి గగ్గోలు పెట్టారు. తాజా నిర్ణయం ఫలితంగా ఇప్పుడెన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఎటూ కాకుండా పోతాయేమో అన్న ఆందోళన వస్తుంది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్, బీఎస్ఎన్ఎల్, ఓఎన్జీసీ, ఎల్ఐసీ లాంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను మనకు కాకుండా చేసిన లేదా చేయాలనుకుంంటున్న ఘనత కూడా వారిదేనని కమ్యూనిస్టు శక్తుల ఆరోపణ.
వీటిలో నిజాలు ఉన్నా కూడా బీజేపీ అనే రాజకీయ శక్తి ఒప్పుకోదు. కేవలం ఇదంతా తాము నష్టాలను భరించలేక చేస్తున్న పనిగానే గుర్తించాలని పదే పదే అంటోంది. వాస్తవానికి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మంచి లాభాల్లో ఉంది. కరోనా సమయంలో విశేష సేవలందించింది. ఆక్సిజన్ బెడ్లు లేక అవస్థపడుతున్న రోగులకు సంబంధిత పడకలను తయారు చేసి ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడున్న లాభాలే సంస్థను నిలబెడతాయి కూడా! కానీ ఆస్తులున్నా సరే రాష్ట్ర సర్కారు జోక్యం లేని కారణంగా కేంద్రం ఈ సంస్థను అమ్ముకుంటోంది అని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నెత్తీనోరూ కొట్టుకుంటోంది.
తాజాగా జిల్లాల విభజన కారణంగా ప్లాంటు ఏరియా రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లిందని ఇది కూడా క్షేమ దాయకం కాదని అంటోంది. ఇన్ని సమస్యలున్నా సరే వాటికి పరిష్కారం చూపాల్సిన కేంద్రం మాత్రం హాయిగా కార్పొరేట్ శక్తులకు అంటగడుతోంది. ఆ విధంగా అయితే అదానీ వర్గాలే కొనాలి. కానీ ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు. ఇదే రీతిన బొగ్గు గనులున్న సింగరేణి ప్రాంతాన్ని తమ అధినం నుంచి తప్పించి, ప్రయివేటు వ్యక్తులకు అందించేందుకు చర్యలు షురూ అయ్యాయి. ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా అమ్మేద్దామనే అనుకుంటున్నారు.ఇక బ్యాంకుల విషయమై కూడా ప్రయివేటు మరియు కార్పొరేట్ శక్తులకే
అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్న వైనం తెలిసిందే! కనుక రానున్న కాలంలో కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే (రాజకీయ ప్రమేయంతో నియమితులవుతుంటారు వీళ్లు) తమ సంస్థలను నేరుగా అమ్ముకునే స్వేచ్ఛను పొంది ఉంటే ఇక అన్ని రంగాలూ అదానీలకూ మరియు అంబానీలకూ చెంది ఉండడం ఖాయం అని సోషల్ మీడియాలో యాక్టివిస్టులు గగ్గోలు పెడుతున్నారు.