జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని.. రెండు పార్టీలు కలిసే ఏపీలో ముందుకెళ్తాయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తమ పార్టీ పెద్దలకు వివరించారమని తెలిపారు. విశాఖలో పవన్‌కల్యాణ్‌ను నిర్బంధించారని.. ఆయన నిర్వహించాల్సిన ‘జనవాణి’ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సరికాదన్నారు. రోడ్ మ్యాప్ ఇవ్వాలని పవన్ అడుగుతున్నారని.. ఆ విషయం తమ పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని తెలిపారు.
పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు కలవడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు సోము వీర్రాజు చెప్పారు. విజయవాడలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ ధియోదర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కన్నా లక్ష్మీనారాయణ పెద్దలని వ్యాఖ్యానించిన సోము.. ఆయన విషయంలో తాను స్పందించనన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడతానని చెప్పారు.
రైతు సంబంధిత పథకాలను సొంత పథకాలుగా సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారని.. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని సోము వీర్రాజు అన్నారు. రాజమహేంద్రవరంలో అమరావతి రైతులపై వైసీపీ దాడిని ఖండిచారు. ఇలాంటి ఘటనలను ఎవరూ ప్రోత్సహించకూడదని చెప్పారు. దాడులను ప్రేరేపించింది వైసీపీ నేతలేనని ఆరోపించారు.