ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటి నుంచి దేశంలో ప్రజారవాణా లేదు. ప్రజలకు ఎక్కడికి వెళ్లాలన్నా రవాణా సౌకర్యం అందుబాటులో లేదు. ఇక ఇప్పుడు ఆంక్షలను సడలించడంలో గ్రీన్ జోన్లలో ఆటోలు, క్యాబ్‌లు, ఆరెంజ్ జోన్లలో క్యాబులు మాత్రమే తిరుగుతున్నాయి. అయితే ఇకపై ప్రజారవాణా కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచన ప్రాయంగా వివరాలను వెల్లడించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్ మే 17వ తేదీతో ముగియనుంది. అయితే ఆ తేదీ తరువాత ప్రజారవాణాను ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి గడ్కరీ తెలిపారు. ఆయన బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అయితే మే 17వ తేదీ తరువాత కేవలం బస్సులను మాత్రమే అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక వాటిలో సీటుకు ఒక్కరు చొప్పున ప్రయాణికులను తీసుకెళ్లాలి. సామాజిక దూరం నిబంధనలను పాటించాలి. శానిటైజర్లు వాడాలి. అన్ని రకాల కరోనా జాగ్రత్తలు పాటించాలి.
కాగా లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ప్రైవేటు కార్యాలయాలు 1/3 వ వంతు సిబ్బందితో పనిచేసేలా అవకాశం కల్పించారు. కానీ ఉద్యోగులకు కార్యాలయాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు. కేవలం సొంత వాహనాలు ఉన్నవారు మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు. దీంతో మే 17వ తేదీ తరువాత ప్రజా రవాణాను పాక్షికంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.