గుడ్‌న్యూస్‌.. ఇకపై వంటకు ఎల్‌పీజీ కాదు, విద్యుత్‌ను తక్కువ ధరకు అందిస్తారు..!

-

దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు త్వరలో మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఇకపై పేదలకు వంట చేసుకునేందుకు ఎల్‌పీజీకి బదులుగా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ వెల్లడించారు. సోమవారం ఆయన బీహార్‌లోని నబీనగర్‌, బార్హ్‌, బరౌనిలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌టీపీసీకి చెందిన సర్వీస్‌ బిల్డింగ్‌, షాపింగ్‌ కాంప్లెక్స్, మెయిన్‌ ప్లాంట్‌ క్యాంటీన్‌లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పేదలకు ఇకపై వంటకు గ్యాస్‌ కాకుండా విద్యుత్‌ను తక్కువ ధరకే సరఫరా చేస్తామని తెలిపారు.

దేశంలోని పేదలకు ఎల్‌పీజీ కాకుండా వంటకు విద్యుత్‌ను అందజేయడం వల్ల పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడే అవకాశం తగ్గుతుందన్నారు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని, ఇది ప్రధాని మోదీ అమలు చేస్తున్న ఆత్మ నిర్భర్‌ కార్యక్రమానికి ఊతం ఇస్తుందని అన్నారు.

ప్రధాని మోదీ ఇప్పటికే పేదల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని, త్వరలోనే వంట కోసం విద్యుత్‌ను సరఫరా చేసే పథకాన్ని కూడా ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం ఎన్‌టీపీసీ చైర్మన్‌, ఎండీ గుర్దీప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. వంట అవసరాల కోసం విద్యుత్‌ వాడకాన్ని తాము ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా బీహార్‌లో ఇప్పటికే 3800 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణంలో ఉండగా.. దేశంలో ఇప్పటి వరకు ఎన్‌టీపీసీ 62,900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వాటిల్లో 70 పవర్‌ స్టేషన్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version