టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే సచిన్.. కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలిచారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుని, వారి అవసరాలు తీర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా.. మరో మంచి పనితో వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజన తెగలకు చెందిన 560 మంది పాఠశాల విద్యార్థులకు ‘టెండూల్కర్ ఫౌండేషన్’ ద్వారా పోషకాహారం, విద్య అందించేందుకు సచిన్ ముందుకు వచ్చారు. మరోపక్క యూనిసెఫ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సచిన్ చిన్నారుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇటీవల ముంబైలోని ఎస్‌ఆర్‌సీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో పలువురు నిరుపేదలకు చిన్నారులకు ఆర్థిక సహకారం అందించాడు. అలాగే ముంబైలోని భివాలిలోని శ్రీ గాడ్గే మహారాజ్ ఆశ్రమ పాఠశాలలో ఆధునిక లర్నింగ్ సదుపాయాలతో పాటు క్రీడల నిర్వహణకు వసతులు కల్పించాడు.