ఒకప్పుడు డిజిటల్ లావాదేవీలు లేని సమయంలో నగదును చెల్లించాల్సి వచ్చేది. అయితే కాలక్రమేణా టెక్నాలజీ మారడంతో మనం ప్రస్తుతం ఏ నగదు లావాదేవీని అయినా సరే క్షణాల్లో చేస్తున్నాం. అవతలి వారికి చిటికెలో డబ్బును ఆన్‌లైన్‌లో పంపించగలుగుతున్నాం. ఇందుకు గాను మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్నాం. ఇక దీనికి సాధారణంగా ఓటీపీలు అవసరం అవుతాయి. అవి మన ఫోన్లకు వస్తాయి. అయితే ఇకపై ఓటీపీల అవసరం లేకుండానే ఆర్థిక లావాదేవీలకు అవకాశం కల్పించనున్నారు.
ప్రస్తుతం మనం నిర్వహిస్తున్న పలు ఆర్థిక లావాదేవీలకు గాను కొన్ని సందర్భాల్లో మనకు ఫోన్లకు ఓటీపీలు వస్తుంటాయి. వాటిని నిర్దిష్టమైన సమయంలోగా ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. అయితే సిగ్నల్ ప్రాబ్లం ఉండి లేదా ఇతర ఏ సమస్య వల్ల అయినా నిర్ణీత సమయంలోగా ఓటీపీ రాకపోతే అప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అలాగే డబ్బులు కూడా అకౌంట్ నుంచి కట్ అవుతాయి. దీంతో వినియోగదారులకు సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యను అధిగమించేందుకే త్వరలో ఓటీపీ లేకుండానే నగదు లావాదేవీలు జరిగేలా నూతన టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు.
అయితే ఓటీపీ లేకుండా ఎలా వెరిఫై చేస్తారు ? అని సందేహం రావచ్చు, ఇందుకు గాను ఓ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తున్నారు. టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించుకోనున్నాయి. ఈ క్రమంలో వినియోగదారుడికి చెందిన ట్రాన్సాక్షన్‌లకు గాను వారు తమ ఫోన్ నంబర్లను వెరిఫై చేస్తే చాలు, ఇందుకు ఓటీపీ అవసరం లేదు. ఈ క్రమంలో ట్రాన్సాక్షన్లు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. అయితే ప్రస్తుతానికి ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం ఇంకా డెవలపింగ్ దశలోనే ఉంది. కానీ వచ్చే ఏడాది జూన్ వరకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మరి అప్పటి వరకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందో, రాదో చూడాలి.