స్పెషల్ స్టోరీ : దివికేగిన పాటల రారాజు

-

తెలుగు పాట‌కు ఘంట‌సాల త‌రువాత అంత‌కు మించిన ఘ‌న‌కీర్తిని తీసుకొచ్చిన మ‌ధుర గాయ‌కుడు, గాన‌ గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. నాటి త‌రం ప్రేక్ష‌కుల‌కు తెలుగు సినిమా పాట అంటే ఘంటశాల‌నే. ఎన్టీఆర్‌, ఏ ఎన్నార్‌ల‌కు ఆ గొంతు త‌ప్ప మ‌రో గొంతు సెట్ట‌వ్వ‌డ‌ని అంటుండేవారు. ఆ త‌రువాత పీబీ శ్రీ‌నివాస్ పేరు మిగ‌తా హీరోల‌కు వినిపించేది. మాద‌వ పెద్ది గొంతు కూడా ఎస్వీ రంగారావు లాంటి సీనియ‌ర్ న‌టుల‌కు మాత్ర‌మే మాధ‌వ పెద్ది పేరు వినిపించేది. అయితే అదే స‌మ‌యంలో `శ్రీశ్రీ‌శ్రీ మ‌ర్యాద‌రామ‌న్న‌` సినిమాతో కొత్త గొంతు వినిపించింది. ఆ గొంతు పేరే ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో 40 వేల‌కు పైగా పాట‌లు పాడి సంగీత స‌ర‌స్వ‌తికి ప్రియ పుత్రుడిగా నిలిచారు. ప్రేక్ష‌కులు ఏ దేవి వ‌ర‌మొ నీవు అనేంత‌గా త‌న గానామృతంతో ఓల‌లాడించి త‌న్మ‌య‌త్వంతో ఊగిపోయేలా చేశారు.

అదే బాలు ప్ర‌త్యేక‌త‌..

ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అస‌లు పేరు శ్రీ‌ప‌తి పండితారాధ్యుల బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. జూన్ 4 1946లో నెల్లూరు జిల్లాలోని కోనేట‌ప్ప‌పేట‌లో సాంప్ర‌దాయ‌మైన శైవ బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించారు. తండ్రి హ‌రిక‌థా క‌ళాకారుడు కావ‌డంతో బులుకు చిన్న‌ప్ప‌టి నుంచే సంగీతం మీద ఆస‌క్తి ఏర్ప‌డింది. తండ్రి కోరిక మేర‌కు మ‌ద్రాసులో ఇంజ‌నీరింగ్ కోర్సులో చేరారు. చ‌దువుకుంటూనే వేదిక‌మీద పాట‌లు పాడుతూ బ‌హుమ‌తులు సాధించారు. 1966లో హాస్య‌న‌టుడు ప‌ద్మ‌నాభం న‌టించిన `శ్రీ‌శ్రీ‌శ్రీ మ‌ర్యాద‌రామ‌న్న‌` చిత్రంతో గాయ‌కుడిగా రంగ‌ప్ర‌వేశం చేశారు. ఈ మూవీ నుంచే బాలు ప్ర‌స్థానం మొద‌లైంది. మొద‌ట్లో తెలుగు, త‌మి చిత్రాల్లోనే పాట‌లు పాడారు. ఆ త‌రువాతే బాలు ప్ర‌తిభ‌కు త‌గ్గ స్థాయిలో అవ‌కాశాలు త‌లుపుత‌ట్టాయి. ఏ హీరో కు పాట పాడితే ఆయ‌న గొంతుని అనుస‌రించడం, వారి హావ భావాల‌కు త‌గ్గ‌ట్టుగా త‌న గొంతుని వినిపించ‌డం బాలు ప్ర‌త్యేక‌త‌. అదే ఆయ‌న్ని మ‌రింత పాపుల‌ర్ చేసింది.

న‌టుడిగా కొత్త అడుగులు …

1969లో వ‌చ్చిన `పెళ్లంటే నూరేళ్ల పంట` చిత్రంతో మొద‌టి సారిగా బాలు న‌టుడిగా మారారు. ఆ త‌రువాత 1990లో వ‌చ్చిన త‌మిళ చిత్రం `కేల‌డి క‌న్మ‌ణి` అనే చిత్రంతో బాలు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రాధిక క‌థానాయిక‌గా న‌టించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో `ఓ పాప లాలీ` పేరుతో విడుద‌లైంది. ఇందులో బాలు పాటిన బ్రీత్‌లెస్ సాంగ్ ఇప్ప‌టికీ ఓ రికార్డే. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కీల‌క పాత్ర‌ల్లోనూ బాలు మెరిసారు. వెంక‌టేష్ న‌టించిన `ప్రేమ‌`, ప్ర‌భుదేవాను హీరోగా ప‌రిచ‌యం చేసిన `ప్రేమికుడు`, వెంక‌టేష్‌తో `ప‌విత్ర బంధం`, విన‌త్‌తో `ఆరోప్రాణం`. నాగార్జున‌తో `ర‌క్ష‌కుడు`, రాజ‌శేఖ‌ర్‌తో `ధీర్ఘ‌సుమంగ‌ళీభ‌వ‌` వంటి చిత్రాల్లో న‌టించారు. 2012లో త‌నికెళ్ళ‌భ‌ర‌ణి ద‌ర్శ‌కుడిగా మారి ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కించిన `మిధునం`లోనూ బాలు క‌థానాయ‌కుడిగా ల‌క్ష్మితో క‌లిసి న‌టించారు. ఈ చిత్రానికి ప్ర‌త్యేక నంది పుర‌స్కారం ల‌భించింది.

డ‌బ్బింగ్ క‌ళాకారుడిగా…

కె. బాల‌చంద‌ర్ రూపొందించిన త‌మిళ అనువాద చిత్రం `మ‌న్మ‌ధ‌లీలు`తో అనువాద క‌ళాకారుడిగా మారారు. అందులో తొలిసారి క‌మ‌ల్‌హాస‌న్‌కు డ‌బ్బింగ్ చెప్పారు. ఆ త‌రువాత క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్‌, స‌ల్మాన్‌ఖాన్‌, భాగ్య‌రాజాచ‌, మోహ‌న్‌, విష్ణువ‌ర్ధ‌న్‌, జెమిని గ‌ణేషన్‌, గిరీష్ క‌ర్నాడ్‌, అర్జున్‌, కార్తీక్ , న‌గేష్‌, ర‌ఘువ‌ర‌న్ వంటి వారికి ప‌లు భాష‌ల్లో గాత్ర దానం చేశారు. ఇక ఆ త‌రువాత నుంచి త‌మిళం నుంచి తెలుగులోకి అనువాదం అయ్యే చిత్రాల‌కు బాలు డ‌బ్బింగ్ చెప్ప‌డం ఆన‌వాయితీగా మారింది. విశేషం ఏంటంటే క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన `ద‌శావ‌తారం` చిత్రంలోని క‌మ‌ల్ పోషించిన ప‌ది పాత్ర‌ల్లో ఏడు పాత్ర‌ల‌కు బాలు డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. అన్న‌మ‌య్య‌, సాయి మ‌హిమ చిత్రాల‌కు గాను సుమ‌న్‌కు బాలు డ‌బ్బింగ్ చెప్పారు. ఆ చిత్రాల‌కు గానూ ఉత్త‌మ డ‌బ్బింగ్ క‌ళాకారుడిగా నంది పుర‌స్కారాలు అందుకున్నారు.

బాలు అందుకున్న పుర‌స్కారాలు..

భార‌త‌య భాష‌ల్లో తెలుగు, త‌మిళ‌, హిందీ తో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ బాలు 40 వేల‌కు పైగా పాట‌లు పాడారు. అత్య‌ధిక పాట‌లు రికార్డు చేసిన గాయ‌కుడిగా ఆయ‌న పేరిట ఓ రికార్డు కూడా న‌మోదైంది.  ఆయ‌న సుదీర్ఘ ప్ర‌స్థానంలో 6 జాతీయ పుర‌స్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 1979లో వ‌చ్చిన `శంక‌రా భ‌ర‌ణం` చిత్రానికి గానూ బాలు జాతీయ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్నారు. 1981లో హిందీలో ప్ర‌వేశించారు. ఆయ‌న చేసిన `ఏక్ దూజే కేలియే` చిత్రానికి గానూ మ‌రోసారి జాతీయ ఉత్త‌య గాయ‌కుడిగా పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఆ త‌రువాత సాగ‌ర‌సంగ‌మం (1983), రుద్ర‌వీణ ( 1988) చిత్రాల‌కు జాతీయ అవార్డులు వ‌రించాయి.  25 సార్లు ఉత్త‌మ గాయ‌కుడిగా, ఉత్త‌మ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా ప‌లు పుర‌స్కారాలు అందుకున్నారు. అంతే కాకుండా త‌మిళ‌నాడు, క‌ర్ణ‌ట‌క రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా బాలుకు ప‌లు పుర‌స్కారాల‌ని అందించి ఘ‌నంగా స‌త్క‌రించాయి.  పొట్టి శ్రీ‌రాములు విశ్వివిద్యాల‌యం నుంచి గౌర‌వ డాక్ట‌రేట్‌ని, ప‌ద్మ‌శ్రీ‌, ప‌ద్మ భూష‌న్ అవార్డుల్ని పొందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version