దేశంలో కరోనా కోరలు చాస్తున్న విషయం తెల్సిందే. అయితే కరోనా పరిస్థితులు కిష్టంగా ఉన్నప్పటికీ బయో బబుల్ లో ఐపీఎల్ మ్యాచ్ లు విజయవంతంగా సాగుతున్నాయి. అయితే భారత్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొందరు విదేశీ ఆటగాళ్ళు బయో బబుల్ ను వీడి స్వదేశాలకు పయనమవుతున్నారు. ఇక తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఇద్దరు విదేశీ ఆటగాళ్ళు ఆ జట్టుకు దూరమయ్యారు. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ లు ఐపీఎల్ నుంచి తప్పుకొని స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్ళడానికి సిద్దమయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల రిచర్డ్సన్, జంపాలు ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్లు అర్సీబీ వెల్లడించింది.
అయితే బయో బబుల్ ను వీడిన రిచర్డ్సన్, జంపాలు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. కరోనా తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలను ఆస్ట్రేలియా నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో వారికి స్వదేశానికి వెళ్ళే వీలు లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం వారు ముంబైలోని ఓ హోటల్లో చిక్కుకుపోయారు. అయితే ఇద్దరు ఆటగాళ్ళు వ్యక్తిగత పర్యటనలో ఉండడంతో వారికి కూడా వారికి ఎటువంటి సహాయం చేయలేమని ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్ళను స్వదేశానికి రప్పించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా) ప్రయత్నాలు చేస్తోంది. ఇద్దరినీ ముందుగా దోహాకు పంపి, అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు రప్పించేందుకు ఏర్పాట్లను ప్రారంభించింది. అయితే స్వదేశాలకు వెళ్లిపోతామన్న విదేశీ ఆటగాళ్లను తాము అడ్డుకోబోమని బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ లో కొనసాగే ఆటగాళ్లను టోర్నీ తరువాత తిరిగి స్వదేశానికి క్షేమంగా చేర్చే బాధ్యత తమదేనని హామీ ఇచ్చింది. బీసీసీఐ ఇలా అభయం ఇవ్వడం చాలా మంది విదేశీ క్రికెటర్లకు మనోధైర్యాన్ని ఇచ్చింది.