టీమ్ ఇండియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ ఊహించని మలుపు తీసుకుంది. మొదటి మూడు రోజులు భారత జట్టు ఆధిపత్యాన్ని ఇంగ్లాండ్ మార్చేసింది. మ్యాచ్ ను తనవైపు తిప్పేసుకుంది. ఈ క్రమంలో నాలుగవ రోజు (సోమవారం) భారత తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ వ్యూహాలను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తప్పుబట్టారు. కెప్టెన్ గా బుమ్రా విఫలమయ్యాడని, సరైన ఫీల్డింగ్ సెటప్ చేయలేక మూల్యం చెల్లించుకున్నాడని చెప్పాడు. ఏ దశలోనూ ఇంగ్లాండ్ పరుగుల జోరును అడ్డుకోలేక పోయాడు అని తెలిపారు.
ముఖ్యంగా చివరి సెషన్ లో బుమ్రా అనుసరించిన విధానాలను చూసి తన మతిపోయింది ఘాటు వ్యాఖ్యలు చేశాడు.” బుమ్రా ఇంత చెత్తగా కెప్టెన్సీ చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. బంతి ఏమాత్రం స్వింగ్ కానీ పరిస్థితుల్లో అతను పెట్టిన ఫీల్డింగ్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టేలా బుమ్రా ఫీల్డింగ్ సెట్ చెయ్యలేదు. బెయిర్ స్టో చెలరేగే అవకాశం ఇచ్చారు. ఎక్కువగా డీప్ లో ఫీల్డింగ్ పెట్టి బౌలింగ్ చేశారు. చివరి రోజు ఉదయం అయినా బూమ్రా తన ఫీల్డింగ్ సెటప్ మార్చుకుంటాడు అని ఆశిస్తున్నా.” అని పీటర్సన్ తెలిపాడు.