భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరి మొత్తం 12 మంది పోటీ పడ్డ ఫైనల్‌లో రెండో స్థానంలో నిలిచాడు. పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించగా.. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ (88.54 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నారు. ఫైనల్ బరిలో మొత్తం ఆరు ప్రయత్నాల్లో నీరజ్ కేవలం రెండో త్రోలోనే సఫలమయ్యాడు. పాక్ ఆటగాడు అర్షద్ రెండు సార్లు 90 మీటర్ల కంటె ఎక్కువగా ఈటెను విసిరాడు. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించగా తొలి సిల్వర్ మెడల్ నీరజ్దే కావడం గమనార్హం.
వెండి కొండ నీరజ్ చోప్రాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజతం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ నీరజ్‌గా రికార్డు క్రియేట్ చేశారని.. ఆయణ్ను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. రాబోయే తరాలకు ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. మరోవైపు ప్రధాని మోదీ స్పందిస్తూ.. నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు. భవిష్యత్ అథ్లెట్లకు నీరజ్ ప్రేరణగా నిలుస్తాడని అన్నారు. మరో పతకం సాధించిన నీరజ్‌ను చూసి దేశం ఉప్పొంగుతుందని మోదీ వ్యాఖ్యానించారు.