పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. దిల్లీ ఎయిర్ పోర్టులో తనకు లభించిన ఘన స్వాగతం చూసి ఈ అథ్లెట్ కంటనీరు పెట్టుకుంది. ఇక వినేశ్ కు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. తాజాగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వినేశ్ సొంత ఊరు బలాలి గ్రామ పెద్దలు. మాటిచ్చిన ప్రకారం ఆమెకు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు.
పారిస్ ఒలింపిక్స్ లో 100 గ్రాములు అధిక బరవు ఉండటం వల్ల అనర్హతకు గురై పతకం చేజార్చుకున్న విషయం తెలిసిందే. అక్కడి నుంచి భారత్ కు తిరిగి వచ్చిన వినేశ్ కు దిల్లీ ఎయిర్ పోర్టులో రెజ్లర్లు బజ్‌రంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు చాంపియన్ తరహాలో స్వాగతం పలికారు. అనంతరం బలాలిలో ఆమె బంధువు మహవీర్ ఫొగాట్, ఖాప్ పంచాయతీ పెద్దలు వినేశ్‌కు గౌరవ మర్యాదలతో స్వాగతం పలికి.. ‘ఒలింపిక్ మెడల్ గెలవకున్నా సరే.. నువ్వు ఎప్పటికీ చాంపియన్‌వే’ అంటూ ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం వినేశ్ కు స్వర్ణ పతకాన్ని అందజేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.