మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బిజెపి, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఈటెల రాజేందర్ వాహనం ధ్వంసం అయింది. ఈ రాళ్లదాడిలో ఈటెల వ్యక్తిగత సిబ్బందితో పాటు పలువురు నేతలకు గాయాలయ్యాయి.
ఈ ఘటనపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఓటమి ఖాయమనే బిజెపి ఇలాంటి దాడులకు తెగబడుతుందని ఆరోపించారు. దాడి చేసింది బిజెపి కార్యకర్తలేనని అన్నారు. బిజెపి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు మంత్రి జగదీష్. ఎట్టి పరిస్థితుల్లోనూ టిఆర్ఎస్ కార్యకర్తలు సహనం కోల్పోవద్దని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుందామని పిలుపునిచ్చారు.