సాధారణంగా వృద్ధాప్యంలో ఎవరికైనా సరే ఎముకలు బలహీనమై కీళ్ల నొప్పుల సమస్యలు వస్తుంటాయి. అది సహజంగానే జరుగుతుంటుంది. కానీ ఈ ఆధునిక యుగంలో యువత కూడా కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. వారి ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. అందుకు మారుతున్న జీవనశైలితోపాటు వారి ఆహారపు అలవాట్లూ కారణమే. కింద తెలిపిన ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా, గుల్లగా మారుతుంటాయి. కనుక వీటిని తీసుకోవడం మానేస్తే ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు. కీళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మనం మానేయాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..
కూల్ డ్రింక్స్…
కూల్ డ్రింక్స్‌లలో కార్బన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ వంటి రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ డ్రింక్స్‌ను తాగితే ఎముకలు బలహీనంగా మారుతాయి. శరీరానికి కాల్షియం సరిగ్గా అందదు. అందువల్ల వీటిని తీసుకోవడం మానేయాలి.
చాకొలెట్…
మోతాదుకు మించి అత్యధికంగా చాకొలెట్లను తిన్నా కూడా ఎముకలు బలహీనంగా మారుతాయి. దీని వల్ల శరీరంలో చక్కెర, ఆగ్జలేట్ నిల్వలు పెరుగుతాయి. దీంతో కాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకోదు. ఈ క్రమంలో ఎముకలు గుల్లగా మారి బలహీనంగా తయారవుతాయి. అందువల్ల అధికంగా చాకొలెట్లను తినడం కూడా మానేయాలి.
మద్యపానం…
అతిగా మద్యం సేవిస్తే శరీరంలో ఉండే కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. దీంతో కీళ్ల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లగా మారుతాయి. బలహీనంగా తయారవుతాయి. అందువల్ల మద్యం సేవించడం మానేయాలి.
ఉప్పు…
ఉప్పు ఎక్కువగా తీసుకున్నా ఎముకలు బలహీనంగా మారుతాయి. అందులో ఉండే సోడియం మన శరీరంలోని కాల్షియంను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. దీంతో శరీరానికి కాల్షియం లభించదు. ఫలితంగా ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక ఉప్పును పరిమితంగా తీసుకోవాలి.
కాఫీ…
కాఫీలో ఉండే కెఫీన్ ఎముకలకు హాని చేస్తుంది. ఎముకలు బలహీనంగా తయారవుతాయి. అందువల్ల కాఫీని తక్కువగా తీసుకుంటే మంచిది.