జైపాల్ అంటే చాలా చిన్న కుర్రాడు. గ్రామీణ తెలంగాణలో వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పేవాడు. అదేవిధంగా హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అంటూ పాఠాలు చెప్పేవాడు. రైతు బిడ్డని నేను అని గర్విస్తూ ఉంటాడు. ఇంకా ఎన్నో ఆయన గురించి చెప్పాలి. తెలంగాణ దారుల్లో ఎందరికో స్ఫూర్తి వంతం అయిన పాఠాలు నూరిపోసి ఇవాళ ఎందరో కన్నీరు కారణం అయి ఉన్నాడు. మా కన్నీటి దీపాల వెలుగుల్లో జైపాల్ నీవు ఉన్నావన్న బాధ దగ్గర ఏం రాయాలో అర్థం కావడం లేదు. వి మిస్ యూ జైపాల్.
ఓ విధంగా ఇది తెలంగాణ బిడ్డలకు జీర్ణించుకోలేని వార్త. యువత ఎంతో బాధ్యతగా ఉండాలని ప్రతినిత్యం పరితపించే ఆ కుర్రాడి నవ్వు ఇక లేదు. ఆయన ఆదర్శం మాత్రమే ఉంది. గ్రామీణ తెలంగాణలో ఎంతో సుపరిచితం అయిన జైపాల్ రెడ్డి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడని రాయడంలో బాధ ఉంది. కన్నీరు ఉంది. తోటి స్నేహితుడి మరణం దగ్గర అంతులేని వేదన ఉంది. అయ్యో! మన ఇంటి బిడ్డ దూరం అయిపోయాడే అన్న దిగులు ఉంది. జైపాల్ ! నీవు ఎక్కడున్నా హాయిగా ఉండు.
నీవు ధైర్యం ఇచ్చిన వాడివే కదా! ఎందుకిలా చేశావు? అని ప్రశ్నించే సాహసంలో నేను లేను.నేనే కాదు నా తెలంగాణ సమాజం కూడా లేదు.ఏదేమయినప్పటికీ నీలాంటి బాధ్యత గల కొడుకు ఈ నేల తల్లి రుణం తీర్చాలని పరితపించే బిడ్డలు లేకపోవడం మా అందరి నుంచి దూరం కావడం అన్నది విచారదాయకం.
ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన కాసాల జై పాల్ రెడ్డి అనే వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. నిజాం సాగర్ లో దూకి ఆయనీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఇతరుల ఆనందానికి తాను కారణం అవుతూ ఉండే జైపాల్ మరణాన్ని ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు.
ఆయన స్వస్థలం జైపాల్ రెడ్డి స్వగ్రామం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామం. హైద్రాబాద్ కు వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాడు. అంతేకాదు గ్రామీణ యువతకు మార్గదర్శకత్వం వహించి ఎందరికో ఆదర్శనీయం అయ్యాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. తనకు ఎవరితోనూ విభేదాలు కానీ వివాదాలు కానీ లేవని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు. కేవలం ఆరోగ్య కారణాలతోనే ఆయనీ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.