యాసంగిలో ఉల్లి ప్రధాన వాణిజ్యకరమైన పంట.. ఆంధ్ర, తెలంగాణాలో రైతులు ఎక్కువగా పండించే పంటల్లో ఉల్లిసాగు కూడా ఒకటి. సరైన జాగ్రత్తలు తీసుకుని, చీడపీడలను నివారిస్తే అధిక లాభాలను పొందవచ్చు. ఈరోజు ఉల్లిసాగుకు అనువైన నేలలు, చీడపీడలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
అనువైన నేలలు:
ఉల్లి సాగుకు నీరు నిల్వని సారవంతమైన మెరక నెలలు అనుకూలంగా ఉంటాయి. ఉప్పు, చౌడు, క్షారత్వం, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. పంట తొలిదశ నుంచే సాగులో సరైన పద్దతులు అనుసరిస్తే అధిక దిగుబడులు వస్తాయి.
చీడపీడలు ;
ఆకుతినే పురుగు: ఈ లద్దె పురుగు బూడిద రంగులో ఉండి నల్లని చారలు ఉంటాయి. ఈ లద్దెపురుగు ఆకులను తినడం వల్ల ఆకు కాడపై రంధ్రాలు ఏర్పడతాయి. దీని నివారణకు 400 మి.లీ. క్లోరోఫైరిఫాస్ లేదా 60 మి.లీ. ఫ్లూబెండామైడ్ లేదా 80 మి.లీ. క్లోరాంట్రనిలిప్రోల్ మందును పిచికారి చేసుకోవాలి.
తామర పురుగులు: ఉల్లిసాగులు అధికంగా వచ్చే తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల తెల్లటి మచ్చలు వస్తాయి. దానితో పాటుగా ఆకులపై, కాడలపై ఊదారంగు మచ్చలు కూడా గమనించవచ్చు. ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు సుడులుగా ఎండిపోవడం చూడవచ్చు. దీని నివారణకు నీలిరంగు జిగురు అట్టలను ఎకరాకు 10`15 చొప్పున పొలంలో పైరు కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి. పురుగు ఉదృతిని బట్టి ఎకరాకు 400 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 300 గ్రా. ఎసిఫేట్ లేదా 80 గ్రా. థయోమిధాక్సామ్ లేదా 200 గ్రా. డైఫెన్ధియురాన్ , అసిటామిప్రిడ్ లేదా 400 గ్రా. ఎసిఫేట్ , ఇమిడాక్లోప్రిడ్ లేదా 60 మి.లీ.స్పైనోశాడ్ లేదా 160 మి.లీ. స్పైనోటోరమ్ మందులను మార్చి మార్చి పిచికారీ చేస్తే సరి.
నులిపురుగులు: నులిపురుగులు మొక్కలో కణజాలాన్ని తిని అంతర పరాన్న జీవులుగా వృద్ధి చెందుతాయి. ఇవి భూమిలో అధికంగా ఉంటే కుళ్ళ లక్షణాలను గమనించవచ్చు. నులిపురుగులు ఆశించిన నారు లేత ఆకుపచ్చ లేదా పసుపురంగులోకి మారి మెలికలు తిరుగుతాయి. లేత ఉల్లిపాయలు మెత్తబడి ఆకారం కోల్పోతాయి. ఈ పురుగు వ్యాప్తి అధికమైనప్పుడు గడ్డ పగులుతుంది. దీని నివారణకు కార్బోఫ్యూరాన్ 4 జి గుళికలు ఎకరాకు 10-12 కిలోల చొప్పున భూమిలో వేసి కలియ దున్నాలి.
ఎర్రనల్లి: నల్లులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చుతాయి. ఆకుల పై భాగాన చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. నల్లి వల్ల ఆకులపైన ఏర్పడే తెల్లని గూళ్ళ లాంటివి గమనించవచ్చు. తరువాత దశలో ఆకుల రంగు మారి ఎండిపోయి రాలిపోతాయి. దీని నివారణకు ఉల్లి పంటకు ప్రసొపార్ గైట్ 1 మి.లీ. లేదా స్పైరోమెసిఫైన్ 0.75 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఉల్లి ఈగ : ఉల్లి ఈగ, ఉల్లి మొలకల మీద గుడ్లు పెట్టడం వలన అవి పొదిగి మొలకలను తింటాయి. తరువాత దశలో లార్వాలు గడ్డ భాగాన్ని ఆశించి మొత్తం నాశనం చేస్తాయి. మొక్కలను దగ్గర దగ్గరగా నాటకూడదు. పంట మార్పిడి పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాలి. దీని నివారణకు ఎకరానికి 400 మి.లీ. డైమిథోయేట్ లేదా 400 మి.లీ. ప్రొఫెనోఫాస్ మందును పిచికారీ చేయాలి.