ఏపీలో ప్రతిపక్షం తామే నని చెప్పుకుంటోన్న బీజేపీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మీద దాడి పెంచుతోంది. ప్రధాని మోడీ హత్య కోసం జరిగిన బీమా కొరెగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న విరసం నేత వరవరరావును వెనకేసుకొచ్చిన వారిలో ఏపీ వైసీపీ ఎమ్మెల్యే ఉండడంతో ఇప్పుడు డైరెక్ట్ గా జగన్ ని టార్గెట్ చేస్తోంది బీజేపీ. ఈ మేరకు ఏపీ ఇంచార్జ్ గా ఉన్న సునీల్ ధియోదర్ ఒక ట్వీట్ చేశారు.
జగన్ రెడ్డి గారూ దేశ ప్రధానమంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన విరసం నేత వరవరరావును విడుదల చెయ్యాలని కోరిన భూమన కరుణాకరరెడ్డిని ఇంకా సస్పెండ్ చేయలేదంటే ఈ లేఖ మీ అనుమతితోనే వెళ్ళిందనుకోవాలా? తక్షణమే ఆ ఎమ్మెల్యే ,ఈడ పై చర్యలు తీసుకోని ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఓవైపు మీరు ప్రధాని మోడీని కలిసి ఫొటోలు విడుదల చేస్తారు. మీ ఎమ్మెల్యే భూమన అదే మోడీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వరవరరావును విడుదల చేయాలని లేఖ రాస్తారు. ఇది మీ ద్వంద వైఖరికి నిదర్శనం కాదా అంటూ బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ నిలదీశారు.