ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ మొదలైన మూడు రోజుల్లోనే నియామకం జరిగిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ల నియామక మార్గదర్శకాలు చెప్పాలని.. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామక పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గురువారం తమ ముందు ఉంచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల అధికారిని రాజకీయ పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలని, అప్పుడే స్వతంత్రంగా వ్యవహరించగలరని వ్యాఖ్యానించింది. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలంటే.. ప్రధాన ఎన్నికల అధికారి నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఎన్నికల కమిషనర్ల నియామకంలో పాటిస్తున్న మార్గదర్శకాలు చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. నవంబర్ 19న కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గురువారం కోర్టు ముందు ఉంచాలని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషనర్ల నియామకంపై విచారణ ప్రారంభమైన మూడు రోజుల్లోనే నియామకం జరిగిందన్న ధర్మాసనం అలా జరగకుండా ఉంటే మరింత సముచితంగా ఉండేదని వ్యాఖ్యానించింది. అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను గురువారం తీసుకురావాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది.
ఈ కేసును విచారించడం మొదలు పెట్టిన తర్వాత నియామకం జరిగినందున ఆ దస్త్రాలను చూడలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. నియామకం కోసం అనుసరించిన ప్రక్రియ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నియామకం చట్టబద్ధమైనదైతే భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీబీఐ డైెరెక్టర్ తరహాలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటి ద్వారా ఎంపిక జరపాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశించింది.