న్యూఢిల్లీ: జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో ఖైదీలకు కరోనా సోకి పరిస్థితి తీవ్రంగా ఉందంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. జైళ్ల నియమావళిని అనుసరించి ఖైదీలను తాత్కాలికంగా షరతులతో కొద్దికాలం వదిలేయాలని హైపవర్ కమిటీలను ఆదేశించింది. గత ఏడాది షరతులతో వదిలి పెట్టిన వారిని కూడా మళ్ళీ వదిలేయమని ఆదేశించింది. అనవసరంగా ఎవరినీ అరెస్ట్ చేయవద్దని కూడా పోలీస్ శాఖను ఆదేశించింది. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసుల్లో కోవిడ్ నేపథ్యంలో అరెస్ట్‌లు చేయవద్దని ఆదేశించింది. ఖైదీలకు కనీస పక్షం 90 రోజులు పెరోల్ ఇవ్వాలని కూడా సూచించింది. జైళ్లలో ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, వారి సంఖ్యను వెబ్ సైట్‌లో ఉంచాలని రాష్ట్రాలకు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.