మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టీ-వాలెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఇకపై ఆ వాలెట్‌కు గాను వినియోగదారులు వర్చువల్ డెబిట్ కార్డును పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ వాలెట్‌ను ఉపయోగించేవారు అందులో వర్చువల్ డెబిట్ కార్డును జనరేట్ చేసుకోవచ్చు. దాంతో కార్డు నంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ నంబర్ తదితర వివరాలు కార్డుపై వస్తాయి. ఈ క్రమంలో ఆ కార్డును టీ-వాలెట్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు.
కాగా టీ-వాలెట్‌కు వర్చువల్ డెబిట్ కార్డు సదుపాయాన్ని అందిస్తున్నట్లు.. వాలెట్ నుంచి వినియోగదారులకు ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి. అందులో భాగంగా వారు వర్చువల్ డెబిట్ కార్డును జనరేట్ చేసుకుంటే.. దాన్ని ఈ-కామర్స్ సైట్లు, బిల్లు చెల్లింపు సైట్లు.. తదితర వెబ్‌సైట్లలో సాధారణ డెబిట్ కార్డు మాదిరిగానే ఉపయోగించుకోవచ్చు. ఇక ఆ కార్డు రూపే ఆధారిత పేమెంట్ గేట్‌వేను కలిగి ఉంటుంది.
అయితే టీ-వాలెట్ ద్వారా వర్చువల్ డెబిట్ కార్డును ఉపయోగించేవారికి పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు టీ-వాలెట్ యాప్‌ను సందర్శించవచ్చు.