ఆ ఎమ్మెల్యే ముద్దుల కొడుకు అధికారులను ఆ రేంజ్ లో టెన్షన్ పెడుతున్నరా ?

-

తండ్రి ఎమ్మెల్యే కావడంతో తనయుడు యువనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. పవర్‌ పాలిటిక్స్‌కు తెరతీశారు ఎమ్మెల్యేగారి ముద్దుల కొడుకు. ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. అడ్డుచెప్పడానికి అధికారులు జంకుతున్నారు.తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే తనయుడి పనులు లాబీయింగ్ తో స్థానిక అధికారులకు కొత్త టెన్షన్ పట్టుకుందట..

కొట్టు సత్యనారాయణ. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే. ప్రస్తుతం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే కాకుండా.. జిల్లా వైసీపీ వర్గాల్లోనూ కొట్టు సత్యనారాయణ కంటే ఆయన తనయుడు కొట్టు విశాల్‌పైనే ఎక్కువగా చర్చ జరుగుతుందట. తండ్రి తర్వాత తండ్రంత కావాలని అనుకుంటున్న విశాల్‌.. తనకంటూ ప్రత్యేక కోటరీని తయారు చేసుకుంటున్నారట. ఎమ్మెల్యే కుమారుడు కావడంతో పార్టీ నేతలు కూడా ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఏ పని కావాలన్నా.. ఎమ్మెల్యే కంటే ముందు విశాల్‌ను సంప్రదిస్తున్నారట పార్టీ నేతలు. ఏదైనా వివాదం తలెత్తినా పరిష్కారం కోసం యువనేతనే ఆశ్రయిస్తున్నారట.

వచ్చే జనం, పార్టీ నేతలు కూడా మీ అంతటోడు లేరని ఆకాశానికి ఎత్తేస్తుండటంతో కొట్టు విశాల్‌.. చాలా విశాల హృదయంతో స్పందిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సమస్య అని వస్తే చాలు తప్పొప్పులను పక్కన పెట్టి.. సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఫోన్‌ చేసి ఆదేశాలిస్తున్నట్టు సమాచారం. మావాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దు అని పోలీసులకు సైతం ఫోన్లు వెళ్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీలోని కొందరు నాయకులకు ఎమ్మెల్యే తనయుడి చర్యలు సంతోషాన్నిస్తున్నా.. మరికొందరికి మాత్రం రుచించడం లేదని చెబుతున్నారు.

తండ్రీ, తనయుల తీరు చూసిన తర్వాత కొందరు వైసీపీ నేతలు ఎందుకొచ్చిన గొడవ అని సైలెంట్‌గా ఉంటున్నట్టు సమాచారం. ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం అంతా కష్టపడి పనిచేస్తే .. పార్టీ అధికారంలోకి వచ్చాక కనీస మర్యాద కూడా దక్కడం లేదని వాపోతున్నారట. దీంతో తాడేపల్లిగూడెంలో ఏం జరుగుతుందా అని కొందరు జిల్లా, రాష్ట్రస్థాయి వైసీపీ నాయకులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనయుడి తీరు, ఆయన ఉపయోగిస్తున్న పదజాలం వారి దృష్టికి వచ్చిందని సమాచారం.

టీడీపీ హయాంలో నిర్మించిన ఓ విశాల సహకార పరపతి సంఘం భవనంలో అవినీతి జరిగిందని అప్పట్లోనే వైసీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కొందరు నాయకులు కొట్టు విశాల్‌ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించగానే.. జిల్లా అధికారులకు ఫోన్లు వెళ్లాయట. అంతే.. దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు వచ్చేశాయి. ప్రత్యర్థివర్గం ఈ ఆదేశాలపై హైకోర్టు తలుపు తట్టింది. అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకుంది. అయితే వెనకా ముందు ఆలోచించకుండా యువనేత తెస్తున్న ఒత్తిళ్లు రివర్స్‌ కొడుతున్నాయని వైసీపీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోందట.

తనయుడి ఆదేశాలు తండ్రి కొట్టు సత్యనారాయణకు తెలిసే జరుగుతున్నాయో లేదో అన్న చర్చ జరుగుతోంది. అధికారులు, జనాలు మాత్రం.. తండ్రి ఆశీస్సులు లేకుండా విశాల్‌ ఏ పనీ చేయబోరని చెవులు కొరుక్కుంటున్నారట. మరి.. ఇక్కడి విషయాలపై ఓ కన్నేసి ఉంచిన పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version