ఆఫ్ఘనిస్తాన్ లోని పౌర ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు తమ చేతిలోకి అధికారం తీసుకుని వంద రోజులు పూర్తయ్యాయి. అమెరికన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో ఈ ఏడాది ఆగస్టు 15న తాలిబన్ దళాలు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే తాలిబన్ నాయకుల అధికారాన్ని చేజిక్కిచ్చుకున్న తర్వాత నుంచి ఆఫ్ఘన్ లో ప్రజల పరిస్థితి దిగజారిపోయింది. మానవతా సాయం కోసం ప్రపంచ దేశాలవైపు ధీనంగా చూస్తోంది. ఇదిలా ఉంటే తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచదేశాలు గుర్తించకపోవడంతో దాని కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం, ఇరాన్, పాకిస్తాన్, చైనా, రష్యా, టర్కీ, ఖతార్, ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఇటలీ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా పదకొండు దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌లో తమ రాయబార కార్యాలయాలను ప్రారంభించాయి. మిగతా దేశాలెవ్వీ ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు పెట్టు కోలేదు.
ఇదిలా ఉంటే తాలిబన్లు నాయకత్వం తీసుకున్నప్పటి నుంచి ఆఫ్ఘన్ లో ఐసిస్- కే ఉగ్రవాద సంస్థ పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది. ముఖ్యంగా మైనారిటీ తెగలే లక్ష్యంగా మసీదుల్లో భారీ దాడులు చేసింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 150 మందికిపైగా అమాయక జనాలు ప్రాణాలు వదిలారు. మరోవైపు స్త్రీల హక్కులను తాలిబన్లు అణచివేస్తున్నారు. ముఖ్యంగా వారి స్వేచ్ఛకు సంకేళ్లు విధించారు. మానవ హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, విద్యా హక్కులను ఆఫ్ఘన్ మహిళలు, బాలికలకు తాలిబన్లు దూరం చేశారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. తాలిబన్ల పాలనలో ఇప్పటి వరకు 257 మీడియా సంస్థలు మూసివేయబడ్డాయి.