ఏపీలో త్వరలోనే తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ రావు అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో ఉన్న ఆయన ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఏకంగా 2.28 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ వైసీపీ విజయం సాధించింది. ఒక్క తిరుపతిలో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డికి 700 ఓట్ల స్వల్ప మెజార్టీ రాగా.. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో విజయం సాధించారు.
సో ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక జరిగితే వైసీపీ గెలుపుకు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే ఇక్కడ వైసీపీకి ప్రధాన పోటీ ఏ పార్టీ ? ఇస్తుంది. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు ? అన్నది మాత్రమే చూడాలి. వాస్తవంగా చూస్తే ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకని భావిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు తాము బీజేపీకి సపోర్ట్ చేస్తామని ఉచిత రాయభారాలు పంపుతున్నారు. నిన్నటి వరకు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓట్ల పరంగా సత్తా చాటుకోవాలని భావించిన బీజేపీ ఇప్పుడు చంద్రబాబు సపోర్ట్ తీసుకోకూడదని భావిస్తోంది.
ఈ ఉప ఎన్నికకు డిసెంబర్ లేదా సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ రావొచ్చని భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన చేశారు. అయితే ఆ పార్టీ మిత్రపక్షం జనసేనకు సైతం తిరుపతితో పాటు కొన్ని సెగ్మెంట్లలో మంచి ఓట్లు రావడంతో జనసేన కూడా తాము పోటీలో ఉన్నమని చెపుతుందా ? లేదా ? బీజేపీకి సపోర్ట్ చేస్తుందా ? అన్నది చూడాలి. చంద్రబాబు ఎలాగూ కాడి కిందపడేసినట్టే కనిపిస్తోంది.
ఇక కాంగ్రెస్ కూడా పోటీ చేయడం ఖాయమే. గతంలో ఇక్కడ ఆ పార్టీ నుంచి పలుమార్లు పోటీ చేసిన సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్ పోటీ చేస్తారని టాక్..? ఈ ఉపఎన్నికలో ప్రతిపక్షాలన్నీ కలిసినా వైసీపీ గెలుపును ఆపటం కష్టమనే అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నికల్లో విపక్షాలు తమ మెజార్టీ తగ్గించి మానసిక విజయం సాధించాలని భావిస్తున్నందున జగన్ ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నెల్లూరు, చిత్తూరు నేతలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఉప ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 50 వేల మెజార్టీ తగ్గకుండా మొత్తం 3.5 లక్షల నుంచి 4 లక్షల మెజార్టీ వచ్చేలా ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు పని చేయాలని ఆదేశాలు జారీ చేశారట. భారీ మెజార్టీతో జనాల్లో వైసీపీ క్రేజ్ ఇసుమంత తగ్గకపోగా.. మరింతగా పెరిగిందని దేశానికి చాటి చెప్పేలా ఇక్కడ మెజార్టీ ఉండాలన్నదే జగన్ లక్ష్యంగా తెలుస్తోంది.
-vuyyuru subhash