ఏపీ కేబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నా కొడాలి నాని నోరు విప్పితే ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. టీడీపీతోపాటు నారా ఫ్యామిలీపై నాని చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనమే. ప్రత్యర్థి పార్టీలు బూతులు అని తీవ్ర అభ్యంతరం చెబుతున్నా.. ఇతర నాయకులు ఇదేం తీరు అని తప్పుపడుతున్నా కొడాలి మాత్రం తన రూటు మార్చుకోరు. అంతేకాదు.. ఆయన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చే నేత కూడా ఇప్పటి వరకు టీడీపీకి దొరకలేదని చెబుతారు. అయితే బందరు వెళ్లాల్సిన జనసేనాని గుడివాడ వైపు ఎందుకు వెళ్లారు ? కొడాలి అంటే వణికిపోయే టీడీపీలో పవన్ సంతోషం నింపారా అన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
గుడివాడలో మంత్రి కొడాలినానికి కి దీటుగా బదులిచ్చే నేతలు టీడీపీలో కరువయ్యారు. మాజీ మంత్రి దేవినేని ఉమాలాంటి ఒకరిద్దరు సీనియర్లు కొంత ప్రయత్నం చేసినా.. వారి విమర్శలు ఆ స్థాయిలో పేలలేదు. లారీ క్లీనర్ అని ఉమా అప్పుడప్పుడూ చేసిన కొన్ని విమర్శలు కొడాలికి పూర్తిస్థాయి కౌంటర్‌గా నిలవలేకపోయాయని టాక్. కేవలం కృష్ణా జిల్లాలోనే కాదు.. మొత్తం టీడీపీలోనే కొడాలితో మాటల యుద్ధానికి దిగే నేత దొరకడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి ఇప్పుడు పవన్ కల్యాణ్ పెద్ద ఆశాకిరణంగా కనిపించారట.
ఇటీవల మచిలీపట్నం వెళ్లిన పవన్ గుడివాడలో ఆగారు. పేకాట క్లబ్బులు నడుపుతున్నారని.. ఇసుక దోచేస్తున్నారని మంత్రి కొడాలి ఇలాకా గుడివాడలో తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ చేసిన ఈ ఆరోపణలకు అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి. పోటీ చేసిన రెండుచోట్లా ఓడి బోడి అయింది పవన్ కల్యాణే అని ఫైర్ అయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్‌తో టీడీపీకి సంబంధం లేకపోయినా వారు మాత్రం హ్యాపీగా ఉన్నారట. గుడివాడలో పవన్ చేసిన విమర్శలకు మంత్రి కొడాలి అంతేస్థాయిలో బదులిచ్చినా.. టీడీపీ నాయకులు మాత్రం.. నాని పై గళం విప్పే నేత దొరికాడు అని సంబర పడుతున్నారట.
ఈ విషయంలో ఇన్నాళ్లూ నెలకొన్న బెంగ ఆ ఎపిసోడ్‌తో తీరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. తాము చేయాల్సిన పనిని ఎవరో ఒకరు చేస్తున్నారుగా అని చెవులు కొరుక్కుంటున్నారట. వాస్తవానికి ఆ రోజు పవన్ కల్యాణ్ టూర్లో గుడివాడ లేదట. విజయవాడ నుంచి బందర్ వెళ్లాలంటే గుడివాడ వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ.. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా గుడివాడ వెళ్లి మంత్రి కొడాలిపై ఆరోపణలు చేశారు. రూట్ మ్యాప్‌లో లేకపోయినా పవన్ గుడివాడ వెళ్లడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ వ్యూహంలో భాగంగానే తన పర్యటనలో గుడివాడను యాడ్ చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట.
ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. పవన్ వర్సెస్ కొడాలి మాటల యుద్ధం టీడీపీకి సంతోషాన్ని తీసుకొచ్చింది. ఈ విషయంలో అద్దెమైక్ అని..దత్తపుత్రుడని అధికార పార్టీ నేతలు పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతమైతే వైసీపీ, జనసేన అభిమానుల మధ్య గుడివాడ ఎపిసోడ్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వార్ నడుస్తోంది. ఈ వివాదంతో సంబంధం లేకపోయినా వైసీపీ, జనసేనలకు మించి టీడీపీలోనే చర్చ జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.