కేడర్‌ బలంగా ఉన్నా అక్కడ టీడీపీని నడిపించే నాయకులే కరువయ్యారా ?

-

టీడీపీ అధికారంలో లేదని పట్టించుకోవడం మానేశారో ఏమో కానీ ఎన్నికల తర్వాత ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఇంచార్జుల దర్శనమే కరువైందట.కేడర్ బలంగా ఉన్నా తమ సమస్యలు చెప్పుకుందామంటే వినే నాయకుడే కరువయ్యాడు.నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ రెండు చోట్లా పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్‌ ఉంది. టీడీపీని అంటిపెట్టుకుని పనిచేసేవాళ్లు ఉన్నారు. కానీ.. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఎవరో ఒకరు టీడీపీలోకి రావడం.. ఓడిపోతే కనిపించకుండా పోవడం జరుగుతోందట.

 

2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి మురళీ కన్నబాబు పోటీ చేసి మేకపాటి గౌతంరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో బొల్లినేని కృష్ణయ్యకు టీడీపీ టికెట్‌ ఇచ్చింది. ఆయనా నెగ్గుకు రాలేకపోయారు. ఓటమి తర్వాత నియోజకవర్గం ముఖమే చూడటం మానేశారట కృష్ణయ్య. పైగా ఆత్మకూరు టీడీపీ ఇంఛార్జ్‌ ఎవరన్నది క్లారిటీ లేకుండా పోయిందట. మరోవైపు నియోజకవర్గంలో వర్గకక్ష్యలు భగ్గుమంటున్నాయి. ఈ గొడవల్లో టీడీపీ కార్యకర్త ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నిత్యం ఏదో ఓచోట ఘర్షణలు కామనైపోయాయి. విషయం తెలుసుకుని మురళీ కన్నబాబు అప్పుడప్పుడూ వచ్చి కార్యకర్తలను పలకరించి వెళ్తున్నారు.

ఇక కృష్ణయ్య మాత్రం ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటంలేదట.జడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి ఆత్మకూరు టీడీపీ ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కొందరు కార్యకర్తలు మాత్రం మురళీకన్నబాబు వైపు మొగ్గు చూపుతున్నారట. నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న కొమ్మి లక్ష్మయ్య నాయుడు పరిణామాలను మౌనంగా వీక్షిస్తున్నారు తప్ప తన అభిప్రాయం ఏంటో చెప్పడం లేదని అంటున్నారు.

ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో ఇబ్బంది పడుతున్నట్లు టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒకటి, రెండుసార్లు మాత్రమే నియోజకవర్గానికి వచ్చారట రామారావు. మహారాష్ట్ర, కర్నాటకల్లో ఉన్న వ్యాపార పనుల్లో బిజీగా ఉంటున్నారట. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని తట్టుకోవడం కార్యకర్తలకు సాధ్యం కావడం లేదని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో మాజీ మంత్రి మాదాల జానకిరాం సమీప బంధవు మదన్‌ టీడీపీ టికెట్‌ ఆశించారు. పార్టీ టికెట్‌ నిరాకరించినా యాక్టివ్‌గా పనిచేశారు. మదన్‌ ఇంఛార్జ్‌ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని సమర్థులకు ఉదయగిరి ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించాలన్నది తమ్ముళ్ల డిమాండ్‌. రాష్ట్ర రాజకీయాలు వేడి వేడిగా ఉన్న సమయంలో పార్టీని పట్టించుకునే వారు లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరి.. ఆత్మకూరు, ఉదయగిరి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version