సీఎం జగన్ కు నారా లోకేష్ బహిరంగ లేఖ.. కేసీఆర్ మాటలు అవమానంగా లేవా ?

-

సీఎం జగనుకు నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఎద్దేవా చేయ‌డం సిఎంగా మీకు అవ‌మానం అనిపిస్తుందో లేదో కానీ, ఐదుకోట్ల ఆంధ్రుల‌కు మాత్రం ఆ వ్యాఖ్యలు తీర‌ని అవ‌మాకరంగా భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తుల‌పై క‌న్నేసిందని.. ప్రభుత్వం నియమించిన రత్న కుమారి కమిటీ ఎవ్వరితోనూ సంప్రదింపులు జరపకుండానే నివేదిక ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు.

ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారితల్లిదండ్రులతో కమిటీ చర్చలు జ‌ర‌పలేదని…ప్ర‌భుత్వం కోరిన నివేదిక ఇచ్చింద‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ జ‌ర‌పాల‌ని జగన్ ను డిమాండ్ చేశారు. ఎయిడెడ్ సంస్థ‌ల్ని య‌థావిధిగా కొన‌సాగించాలి… ఏ ఒక్క స్కూలూ మూత‌ప‌డకుండా చూడాలన్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న‌ అనాలోచిత‌, మూర్ఖ‌పు నిర్ణ‌యాల‌తో ఎయిడెడ్ స్కూళ్లు డెడ్ అవుతున్నాయని తెలిపారు. ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం.. లక్షలాది విద్యార్థుల భ‌విష్య‌త్తుకి మ‌ర‌ణ‌శాస‌నమన్నారు.

అన్ని వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేయాల‌నేది పాల‌కుడి ల‌క్ష్య‌మైతే… ఒకే ఒక్క విద్యా వ్య‌వ‌స్థ‌ని ధ్వంసం చేస్తే చాలని త‌త్వ‌వేత్త మాకియ‌వెల్లి అన్నారని పేర్కొన్నారు. విద్యా వ్య‌వ‌స్థ‌పై చేస్తోన్న దాడి చూస్తుంటే, అన్ని వ్య‌వ‌స్థ‌ల ధ్వంసానికి తెగ‌బ‌డుతున్న‌ట్టే అనిపిస్తోందని.. అమ్మ ఒడి ఇవ్వ‌డానికి ..కొడుకు బ‌డిని బ‌లిపీఠంపై ఎక్కించ‌డం భావ్య‌మేనా..? అని జగన్ పై ఫైర్ అయ్యారు. మొన్న వైజాగ్, నిన్న కాకినాడ, నేడు గుంటూరు, రేపు మరో ప్రాంతం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠ‌శాల‌ల మూసివేత‌కు వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులు రోడ్లెక్కి నిర‌స‌న తెలియ‌జేస్తోన్నారని.. ఇంత జరుగుతోన్నా.. మీ మూర్ఖ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకుంటున్నారంటే ఏమ‌నుకోవాలి ? అని నిలదీశారు లోకేష్. మీ ఎయిడెడ్ సూళ్ల ఆస్తుల‌పై మీ క‌న్నుప‌డ‌టం వల్లే మూసివేతకు పూనుకుంటున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version