తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వరుస షాకుల పరంపరలో మరో అదిరిపోయే షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ భారీ ఎదురుదెబ్బ తగలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి గురువారం రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన టీడీపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిదని, ఈ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం కూడా కష్టమని కూడా రాజా చెప్పారు.
ప్రజలు ఏం కోరుకుంటున్నారో ? దానిని గుర్తించడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందన్నారు. తాను ఎప్పుడో టీడీపీ నుంచి బయటకు రావాలనుకున్నానని…. టీడీపీలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. అక్కడ కాపులకు సరైన గుర్తింపు లేదని కూడా చెప్పారు. టీడీపీలో ఉన్న 80 శాతం కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. కాపుల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచి ఒకే విధానంతో ఉన్నారని మెచ్చుకున్నారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనపై రాజా ప్రశంసలు కురిపించారు. జగన్ పేదల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని.. కేవలం మూడు నెలల్లోనే వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. రాజధాని మారుస్తానని సీఎం జగన్ ఎక్కడా చెప్పలేదని, టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.
ఇక రాజధాని అమరావతిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలే ఏకంగా 90 శాతం భూములు కొన్నారని కూడా రాజా తెలిపారు. తాను కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ట్విస్ట్ ఏంటంటే రాజా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ వరుపుల రాజా 4611 ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేతిలో ఓడిపోయారు.
అంతకు ముందు ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన వరుపుల సుబ్బారావు టీడీపీలో చేరిపోయారు. ఆయనకు ఈ ఎన్నికల్లో సీటు ఇవ్వని చంద్రబాబు చివర్లో రాజాకు సీటు ఇచ్చారు. దీంతో ఎన్నికలకు ముందే సుబ్బారావు తిరిగి వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు ఎన్నికల్లో ఓడిన రాజా కూడా వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇది బాబుకు మామూలు షాక్ కాదనే చెప్పాలి.