బాబు కాక‌పోయినా.. ఆ టీడీపీ నేత‌ను జ‌గ‌న్ ఆదుకుంటున్నారట..‌!

-

అవును! ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, రాజ‌కీయంగా మంచి ప్ర‌స్థానం ఉన్న మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఉర‌ఫ్ మాగంటి బాబు గురించి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు. ఆయ‌న‌కు గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఎంపీగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న పెద్ద‌గా దూకుడు చూపించ‌లేక పోయారు. కానీ, ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యంతో మాగంటి రాజ‌కీయ దూకుడు పెరుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిపై మాగంటి బాబు ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం కూడా త‌మ లెక్క‌లు తాము వేసుకుంటున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.


ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సీఎం జ‌గ‌న్ రాష్ట్రంలోని ప‌ద‌మూడు జిల్లాను పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప్రాతిప‌దిక‌న విభ‌జ‌న చేయాలని, కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయాల‌ని అనుకున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ ప్ర‌క్రియ కూడా ఇప్ప‌టికే జ‌రిగిపోయింది. అయితే, మ‌రిన్ని కీల‌క అంశాల‌పై దృష్టి పెట్టేందుకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని నేతృత్వంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఇక‌, ఈ క‌మిటీ వ‌చ్చే మార్చి నాటికి రిపోర్టు ఇస్తుంద‌ని అంటున్నారు. అయితే, ఇప్ప‌టికే అందిన రెవెన్యూ అధికారుల రిపోర్టు ప్ర‌కారం.. జిల్లాల స్వ‌రూపాలు ప్ర‌స్తుతం ఉన్న‌వి చాలా మ‌టుకు మారిపోతున్నాయి. కొత్త‌గా ఏర్పాటు కాబోయే జిల్లాల హ‌వా పెర‌గ‌నుంది.

ఈ లెక్క‌న చూస్తే.. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న మాగంటి బాబుకు పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడిగా పేరుంది. జిల్లాల విభజన జరిగితే ఆయన ‘ఏలూరు జిల్లా’ నాయకుడు అవుతారు. అయితే, కొత్తగా కలిసే కైకలూరు నియోజవకర్గంతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉండటం ఆయ‌న‌కు భారీగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే.. ఇక్క‌డ నుంచి ఆయన కాంగ్రెస్ టికెట్‌పై గ‌తంలో ఎమ్మెల్యేగా కూడా విజ‌యం సాధించారు. పైగా ఆయ‌న వ్యాపారాలు వ్య‌వ‌హ‌రాలు కూడా కృష్ణాజిల్లాతో అనుబంధం పంచుకున్న‌వే. దీంతో త‌న‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి జిల్లాగా ఏర్పాటు చేస్తుండ‌డంతో మ‌కుటం లేని మారాజు అయిపోవ‌చ్చ‌నేది మాగంటి వారి ఆలోచ‌న‌. మొత్తానికి బాబు కొంత ఇస్తే.. జ‌గ‌న్ మ‌రెంతో ఇస్తున్నారన్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version