పిలిచినా రానంటున్నారా ? వద్దు బాబోయ్ అంటున్నారా ?

-

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పదవులకు పెద్ద పోటీ ఉండేది. పార్టీ పదవుల ద్వారా తమ పలుకుబడి పెంచుకుందామనే ఉద్దేశంతో నాయకులంతా తీవ్రంగా పోటీ పడేవారు. ఈ క్రమంలో కొంతమంది నామినేటెడ్ పోస్టులను సైతం ఏకం చేసి మరీ పార్టీ పదవులను స్వీకరించేవారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అంటే ఆ స్థాయిలో క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిలిచి పదవులు ఇస్తామని మొత్తుకుంటున్నా, తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. త్వరలోనే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవులను భర్తీ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ముందు ముందు ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేపట్టి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహారాలు చేయాల్సి ఉండడంతో, పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవితో పాటు, మొత్తం టిడిపి అన్ని విభాగాల్లోనూ చురుకైన నాయకులను, ప్రజాదరణ ఉన్న వారిని నియమించాలని చూస్తున్నారు.

ఈ మేరకు జిల్లాల వారీగా నాయకులను గుర్తించి పార్టీ పదవుల్లో నియమించాలని చూస్తుండగా, పార్టీ పదవులను స్వీకరించేందుకు నాయకులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. తమకు పార్టీలో ఏ పదవులు అవసరం లేదని, పార్టీ పదవులు తీసుకుని పోరాటాలు చేస్తూ, వైసీపీ ప్రభుత్వ వేధింపులను తట్టుకోవడం తమ వల్ల కాదంటూ, జిల్లా స్థాయి నాయకులు ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి టిడిపిలో ఉందట. అదీ కాకుండా పార్టీ పదవులు స్వీకరిస్తే ఆర్థికంగానూ, భారీగా ఖర్చు చేయాల్సి ఉండటం, అలా చేసినా, వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కుతుందన్న గ్యారెంటీ లేకపోవడం, అసలు పార్టీ పరిస్థితి అప్పటికి ఏ విధంగా ఉంటుందో తెలియక పోవడం, ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని, పార్టీ పదవుల్లో తమను నియమించ వద్దంటూ రాష్ట్రస్థాయి నాయకులకు చెప్పేస్తున్నారట.

అదీ కాకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది అభ్యర్థులు ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా లేరు. ఎవరూ యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ వ్యవహారం అధినేతకు పెద్ద తలనొప్పిగా మారిందట. తాను యాక్టివ్ గా ఉన్న సమయంలో ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంటే, ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, పార్టీ బరువు బాధ్యతలు మోసేవారు కరువయితే క్షేత్రస్థాయిలో మరింత బలహీనం అవుతామనే ఉద్దేశం తో బాబు కాస్త ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version