ఏపీలో అధికార వైసీపీ దెబ్బకు విపక్ష టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వరుస పెట్టి ఫ్యాన్ కింద సేద తీరేందుకు రెడీ అవుతున్నారు. జగన్ పార్టీ గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది. జనసేన రాజోలుతో సరిపెట్టుకుంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేవలం 23 సీట్లు సాధించింది. ఈ 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు దూరం జరిగిని జగన్‌కు దగ్గరయ్యారు. వీరిలో కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు. టీడీపీ నుంచి గన్నవరంలో వరుసగా రెండోసారి గెలిచిన వంశీకి స్థానికంగా కాస్త పట్టు ఉంది. అందుకే ఇంత భయంకరమైన జగన్ వేవ్ తట్టుకుని మరీ ఆయన గన్నవరంలో రెండోసారి గెలిచారు.
వంశీ పార్టీని వీడడంతో గన్నవరం టీడీపీ పగ్గాలు ఎవరికి అప్పగించాలో కూడా తెలియని డైలమాలో చంద్రబాబు నిన్నటి వరకు ఉన్నారు. ముందుగా పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్ పేరు వినపడింది. ఆ తర్వాత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే అనూరాధ పేరు వినిపించింది. అయితే వీరెవ్వరు కూడా గన్నవరంలో పార్టీ పగ్గాలు తీసుకునేందుకు ఒప్పుకోలేదు. చివరకు అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జనుడికి బాధ్యతలు ఇవ్వాలని ఒకానొక దశలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వంశీపై బీసీ అస్త్రం ప్రయోగించి దెబ్బ కొట్టాలని చూసినా తర్వాత ఎందుకో కాని అర్జనుడు కూడా వెనక్కు తగ్గారు.
ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలమైన అభ్యర్థులను నిలబెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. కేడర్ కూడా చంద్రబాబును కలిసి గన్నవరంకు ఇన్‌చార్జ్‌ను ప్రకటించకపోతే పార్టీ దెబ్బ తింటుందని చెప్పడంతో చివరకు చంద్రబాబు ఇక్కడ ఇన్‌చార్జ్‌ను నియమించాలని డిసైడ్ అయ్యారు. జిల్లా పార్టీ ముఖ్య నేతలతో రెండు రోజులుగా చర్చించిన ఆయన అమెరికాలోని తానాలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఓ ముఖ్య సభ్యుడికి గన్నవరం టీడీపీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ముందుగా బాబు ఇక్కడ బీసీ అస్త్రం ప్రయోగించాలనుకున్నారు. ఇప్పటికే గన్నవరం పక్కన ఉన్న నూజివీడులో బీసీ నేతే ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అటు కైకలూరులో కూడా బీసీ నేతే ఉండడంతో ఇప్పుడు ఇక్కడ కమ్మ నేతకే పగ్గాలు అప్పగించనున్నారు. మరి సదరు ఎన్నారై నేత ఎంట్రీతో అయినా గన్నవరం టీడీపీలో ఆశలు చిగురిస్తాయేమో ? చూడాలి.
-vuyyuru subhash