రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కేంద్రంగా అధికార వైఎస్సార్ సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజకీయాలు ముదురుతున్నాయి. అంబేడ్కర్ స్మృతి వనం విషయంలో రాజుకున్న ఈ వివాదాలు నువ్వు ఒకటంటే.. నే రెండంటా..! అనే రేంజ్లో ఇరు పార్టీల్లోనూ సాగుతుండడం గమనార్హం. రాజధాని అమరావతిలో ఎస్సీ వర్గానికి చెందిన భూములను చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో విరివిగా తీసుకుంది. ఈ క్రమంలో అనేక మంది రైతులు భూములు స్వతహాగా ఇచ్చారని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అప్పటి ప్రభుత్వం వారిని బెదిరించి భూములు లాక్కుందనే వాదన ఉంది.
దీని నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు, ఎస్సీ వ్యతిరేకత పార్టీపై పడకుండా ఉండేందుకు చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో అంబేడ్కర్ స్మృతి వనం అనే ప్రణాళికను తీసుకువచ్చింది. రాజధాని ప్రాంతమైన ఐనవోలులో దీనిని నిర్మించేందుకు భూమిని కూడా కేటాయించింది. దీనికి సంబంధించి మొత్తం 100 కోట్ల ప్రాజెక్టుగా కూడా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. అయితే, దీనిని ప్రభుత్వం అధికారం నుంచి దిగేపోయేనాటికి కేవలం 15 పర్సంట్ మాత్రమే మొదలు పెట్టారు. ఇక, తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఇటీవల దీనిపై సంచలన ప్రకటన చేసింది. విజయవాడ నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యుడీ గ్రౌండ్లో అంబేడ్కర్ ఉద్యానవనం నిర్మిస్తున్నట్టు చెప్పడం.. ఆ వెంటనే శంకుస్థాపన చేయడం కూడా జరిగిపోయింది.
ఇక, ఇప్పుడు దీనికి ముహూర్తం కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న నిర్వహించుకునే అంబేడ్కర్ జయంతి నాటికి దీనిని ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు జరపాలని సూచించారు. దీంతో ఇది టీడీపీ తీవ్రవిఘాతంగా మారింది. అలాగని విజయవాడలో నిర్మాణాన్ని వద్దంటే.. ఎస్సీల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీంతో ఎదరుదాడికి ఎస్సీ వర్గాలను రంగంలోకి దింపింది. అంబేడ్కర్ స్మృతి వనాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ప్రశ్నించారు.
అమరావతిలోని తాటికొండ ప్రాంతంలో అంబేడ్కర్ స్మృతివనాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బడుగు, బలహీన వర్గాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత డొక్క మాణిక్యంపై ఉందన్నారు. పేద రైతుల భూములను లాక్కుంటే ఎం తటి పోరాటాలకైనా టీడీపీ సిద్ధమన్నారు. దీనికి కౌంటర్‌గా వైఎస్సార్ సీపీ నాయకులు.. ఎక్కడో మారుమూల నిర్మించేకంటే.. విజయవాడ నగరం నడిబొడ్డున నిర్మిస్తే.. మీకొచ్చిన నొప్పేంటని? ఎదురు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఇరు పక్షాలు కూడా అంబేడ్కర్ కేంద్రంగా రాజకీయాలు చేసుకోవడం ఆసక్తిగా మారింది.