ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలను అధికార వైసీపీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా బలహీనంగా ఉన్న ఆ పార్టీ లో ఉన్న కొందరు నేతలను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ తరుణంలోనే రాయలసీమలో ఉన్న కొందరు విపక్ష పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఎంపీలు ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. బలమైన వర్గాలు ఉన్న వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, గత ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామసుబ్బా రెడ్డికి గాలం వేసారు. ఆయనకు నియోజకవర్గంతో పాటుగా కడప జిల్లాలో కూడా మంచి పట్టునది. దీనితో ఆయన్ను పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదని తెలుస్తుంది. వాస్తవానికి ఆయన టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు.
ఎన్టీఆర్ హయాంలో పార్టీలోకి ఆయన కుటుంబం అడుగుపెట్టింది. ఇక ఫ్యాక్షన్ ఇబ్బందులు ఉన్నా సరే ఆయన పార్టీలో ఉండటానికే మొగ్గు చూపారు. అయితే ఆయనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటనలో విమానాశ్రయంలో కలిసారు. అక్కడి నుంచి పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక సోమవారం ఆయన వైసీపీలోకి వచ్చేశారని కథనాలు ప్రసార౦ చేసారు.
దీనిపై రామసుబ్బా రెడ్డి స్పందించారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన కొండాపురం, ముద్దనూరు మండలాల కార్యకర్తల సమావేశం మధ్యాహ్నం 12 వరకు ప్రారంభం కాకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేసారు. తనకు పార్టీ మారే ఉద్దేశం ఉంటే బహిరంగంగా అందరికీ చెప్పే చేస్తానని ఆయన అన్నారు.
తాము పార్టీ ఆవిర్భావం నుంచే టీడీపీలో ఉన్నట్లు గుర్తు చేశారు. తమ చిన్నాన్న శివారెడ్డి హయాం నుంచి ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. తన ప్రమేయం లేకుండానే కొన్ని చానళ్లు వైసీపీలో చేరినట్లు ప్రచారం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్స్, సర్పంచ్‌లుగా పోటీచేసే వారు తప్పకుండా టీడీపీ గుర్తుపైనే పోటీ చేయాలని కోరారు.