ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రమంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్… తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశాలివ్వగానే మంత్రులందరూ మానసికంగా సమావేశానికి సిద్ధమైపోయారు. ఈసారి కేబినెట్ సమావేశం అత్యంత కీలకమైనది. ఎందుకంటే… త్వరలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్‌పై ఇవాళ్టి చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలో డేట్ ఫిక్స్ చేసే ఛాన్సుంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు పట్టణ ప్రగతి, పల్లెప్రగతి, ఇతర కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మార్చి మొదటివారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయే అవకాశమున్న నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. కాగా, ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిధుల కొరత వేధిస్తోంది. కేంద్రం నుంచీ వచ్చే నిధులు కూడా తక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో బడ్జెట్ రూపకల్పన పెద్ద సమస్యగా మారింది. అమలవుతున్న హామీలకు చాలా నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్నదానిపై కేబినెట్ మీట్‌లో కేసీఆర్ ఎలాంటి సూచనలు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.