గ్రామీణ ప్రాంతాల్లో సహజంగానే ప్రజలకు వైద్య సదుపాయాలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటాయి. ఇక ప్రత్యేకమైన చికిత్స కావాలంటే పట్టణాలకు, నగరాలకు పరుగెత్తాల్సిందే. ఈ క్రమంలోనే కార్డియాలజీ, డయాబెటాలజీ, న్యూరాలజీ తదితర స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లు కావాలంటే కచ్చితంగా గ్రామీణ ప్రాంత వాసులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. అయితే పల్లె వాసులకు ఆ ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ఆ డాక్టరే స్వయంగా వారి వద్దకు వెళ్లి చికిత్సనందిస్తున్నారు. ఆమే.. డాక్టర్ బిందు మీనన్..
డాక్టర్ బిందు మీనన్ ఓ ప్రముఖ న్యూరాలజిస్ట్. ఆమె గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి న్యూరాలజీ సేవలు అందించేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే తన పేరిటే ఆమె బిందు మీనన్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. దాని సహాయంతో పల్లెల్లో ఉండే వారికి ఆమె న్యూరాలజీ సేవలు అందిస్తున్నారు. ప్రతి ఆదివారం ఫౌండేషన్‌కు చెందిన వ్యాన్‌లో ఆమె ఇతర డాక్టర్లు, సిబ్బందితో ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి వారికి ఉండే న్యూరాలజీ సమస్యలను పరిష్కరిస్తున్నారు. వారికి న్యూరాలజీ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. అందుకు గాను ఆమెకు తోటి డాక్టర్లు, సిబ్బంది వాలంటీర్లుగా సహాయం చేస్తుండడం విశేషం.
సాధారణంగా గ్రామాల్లో ఫిట్స్, పక్షవాతం తదితర సమస్యల పట్ల ప్రజల్లో అపోహలు ఉంటాయి. అయితే గ్రామస్థుల్లో అలాంటి అపోహలను తొలగించడంతోపాటు వారికి న్యూరాలజీ, ఇతర వైద్య విభాగాల్లో నాణ్యమైన సేవలను అందించేందుకు డాక్టర్ బిందు మీనన్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అలాగే అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులను, శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె 23 గ్రామాలకు ఈ విధంగా ఉచితంగా సేవలు అందించారు. ఇకపై కూడా ఆమె తన సేవలను కొనసాగించనున్నారు..!