కరోనా మహమ్మారి పేరు చెబితేనే ఇప్పటికీ కొన్ని దేశాలు హడలెత్తిపోతున్నాయి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తుండగా.. మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రజలపై విరుచుకుపడుతోంది. దీనికితోడు మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు సైతం మళ్లీ పుంజుకుంటున్నాయి. అయితే.. తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య మరోసారి వెయ్యి దాటింది. గడచిన 24 గంటల్లో 43,318 కరోనా పరీక్షలు నిర్వహించగా… 1,061 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.
అత్యధికంగా హైదరాబాదులో 401 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 63, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56, నల్గొండ జిల్లాలో 51, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 46, కరీంనగర్ జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,23,724 మంది కరోనా బారినపడగా, వారిలో 8,13,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,357 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.