ఈరోజు ప్రధాని మోడీ తెలంగాణలో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ లో అభివృద్ధి అవుతున్న కరోనా వ్యాక్సిన్ ని పరిశీలించేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన భారత్ బయోటెక్ ప్లాంట్ ను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో భారత్ బయోటెక్ లో తయారవుతున్న వ్యాక్సిన్ ను ముందుగా తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రంలో తయారు కావడం గర్వకారణమని ఆయన అన్నారు.
తెలంగాణ గడ్డ మీద వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి ఆ ఫలితం ఇక్కడి ప్రజలకు ముందుగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజలకు సరిపోయేన్ని వ్యాక్సిన్ డోస్ లు ఇవ్వాలని కోరుతున్నామని ఆయన అన్నారు. కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాబట్టి ప్రజలందరికీ అతి త్వరలో ఈ వ్యాక్సిన్ అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.