ఆవిర్భావం : తెలంగాణ  ఎవ‌రు తెచ్చిన్రు !

-

వేయి పున్న‌ములు విక‌సించాయ‌ని
కేసీఆర్ అంటారు
వంద వేడుకలు జ‌రుపుకోవాల‌ని
ఇదే సిస‌లు సంద‌ర్భం అని కూడా అంటారు.
నిజాలు వీటికి భిన్నంగా ఉంటే బ‌డుగుల తెలంగాణ
ఒక‌టి  ఎలా ఉందో తెలుసుకుంటే అది బంగార తెలంగాణ కింద‌కు
ఎప్పుడొస్త‌దో ఎట్ల‌స్త‌దో చెబితే ఆనందించాలి మ‌నం..
మ‌రి !తెలంగాణ‌లో మాఫియా తోఫియా ఏమ‌యింది గ‌ద్ద‌ర‌న్నా!
మీరంతా స‌ల్లంగుండాలే మీరంతా సక్కంగుండాలే..ఇదే చెప్తున్నారు
ముచ్చింత‌ల్ స‌మతామూర్తి సాక్షిగానో లేదా సిరిసిల్ల రంగుల దారం సాక్షిగానో

ఆంధ్రా పాల‌కుల‌ను ఇక‌పై తిట్ట‌ను అని చెప్పారు కేసీఆర్. ఆ విధంగా కేసీఆర్ తిట్ల దండకం ఆగిపోయింది. ఆ విధంగా తెలంగాణ ఆవిర్భావం కూడా జ‌రిగిపోయింది. ఉద్య‌మ తెలంగాణ క‌ల సాకారం అయిన సంపన్న కుటుంబాల‌కు ఓ విధంగా ఈ ఏర్పాటు కూడా క‌లిసే వ‌చ్చింద‌న్న‌ది ఓ విమ‌ర్శ. ఓయూ విద్యార్థుల గొంతుక‌లు ఆ రోజు ఉప‌యోగ ప‌డినంత గా త‌రువాత ఉప‌యోగ‌ప‌డ లేదు పెద్ద సారుకు అని కూడా ఓ విమ‌ర్శ. ఈ రెండు విమ‌ర్శ‌ల మ‌ధ్య సంప‌న్న తెలంగాణ బాగుంది. బీద తెలంగాణ, బ‌డుగు తెలంగాణ అలానే ఉంది. కోపం వ‌చ్చినా, రాకున్నా తెలంగాణ అంటే న‌క్స‌ల్ తెలంగాణ అని, సామాజిక తెలంగాణ అని కొన్ని నియ‌మాలు వ‌చ్చాయి. సూత్రాలు వ‌ల్లెవేత మానుకుని వాస్త‌వాల గుర్తింపులో ఉద్య‌మ గ్రూపులు కొన్ని పార్టీలు కొన్ని తెలంగాణ రాష్ట్ర స‌మితికి దూరం అయ్యాయి. ఆ విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఒంటరిగా ఉండిపోయింది.

సామాజిక అస‌మాన‌త‌లు అలానే ఉన్నాయి. ఇంకా మారాల్సింది ఉంది. మార్చుకుని ప్ర‌గ‌తి గ‌తిని తీర్చి దిద్దుకోవాల్సింది ఉంది. తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్క‌రే కాదండి ఎంద‌రెంద‌రో అమ‌రుల త్యాగం అని ఇవాళ వినిపిస్తున్న వాదం మ‌రింత తీవ్ర‌త‌రం అయితే త్యాగాల తెలంగాణ ఫ‌లాలు ఏ ఒక్క పార్టీకో చెందిన‌వి అయి ఉండ‌వు. ఆ విధంగా కేసీఆర్ కూడా త‌న‌ని తాను మార్చుకోవాల్సిన రోజు రానే వ‌చ్చింది. ఇక‌పై తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలి. బంగారు తెలంగాణ నినాదం బాగుంది కానీ ఆ విధంగా పాల‌కు లు చేయాల్సిన ప‌నులు చేయలేదు అన్న‌ది ఓ వాద‌న. విమ‌ర్శ. ఇదే వాస్త‌వం కూడా !

తెలంగాణ‌లో వ‌ల‌స వాదం లేదు అని ఎవ్వ‌ర‌న్నా ఒప్పుకోవ‌ద్దు అని అంటున్నాయి విప్ల‌వ పార్టీలు. సామాజిక శ‌క్తుల పున‌రేకీక‌ర‌ణ‌తో మంచి మార్పు సిద్ధిస్తుంది అని అంటున్నాయి. ఆ విధంగా ఆ రోజు జ‌య‌శంక‌ర్ అందించిన స్ఫూర్తి అంత‌కుమునుపు కాళోజీ అందించిన స్ఫూర్తి, దాశ‌ర‌థి అందించిన స్ఫూర్తితో ప‌నిచేయాల్సిన రోజులు ముందున్నాయి. అందుకు ఓయూ సిద్ధం కావాల్సి ఉంది అన్న‌ది సామాజిక వేత్త‌ల అభిప్రాయం. తెలంగాణ అంటే ఒక్క కేసీఆర్ అని మాత్ర‌మే ఓ ఐకానిక్ స్ట్ర‌క్చ‌ర్ ను డెవ‌ల‌ప్ చేయ‌డం వెనుక చాలా మీడియా శ‌క్తులు కృషి చేశాయి అని, కానీ ఆఖ‌రికి అమ‌రుల పేర్లు కూడా అంత‌ర్థానం కావ‌డమే ఇవాళ విచార‌క‌రం అని అంటున్నాయి కొన్ని విప్ల‌వ పార్టీలు. ఈ నేప‌థ్యంలో మంచి పాల‌న, మంచి మార్పు ఇవి క‌దా కావాలి. కనుక సామాజిక తెలంగాణ బ‌హుజ‌న తెలంగాణ సాధ‌నే ముందున్న కాలంలో ధ్యేయం అయితే అంద‌రికీ అధికారం.. అంద‌రికీ స‌మాన అవ‌శాలు అన్న‌వి సాధ్యం అవుతాయి. జై తెలంగాణ..జైజై తెలంగాణ..

Read more RELATED
Recommended to you

Exit mobile version