తెలంగాణ పడతులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని గవర్నర్ తమిళి సై అన్నారు. మనం సంస్కృతిలో మహిళలను శక్తి స్వరూపంగా భావిస్తామని గుర్తు చేశారు.
సమాజంలో సగ భాగమైన స్త్రీలు….అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందని గవర్నర్ చెప్పారు. పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ విభిన్న రంగాల్లో సాధిస్తున్న అపూర్వ విజయాలు నారీ శక్తిని చాటుతున్నాయని పేర్కొన్నారు.
మరోవైపు ఇవాళ రాష్ట్రంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేసి.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 27 మంది నారీమణులను మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ సన్మానించనున్నారు. విశిష్ట మహిళా పురస్కారం కింద లక్ష రూపాయల నగదు, జ్ఞాపికలు అందించనున్నారు