రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు 3 వారాల సమయమిచ్చింది. పేపర్ లీకేజీ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు పంపింది.
కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ వివేక్ ధన్కా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు హైకోర్టుకు వచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ కేసుపై సమగ్ర విచారణ జరపాలని ఏఐసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ వివేక్ ధన్కా కోర్టును కోరారు. ఇద్దరు నిందితులకే సంబంధం ఉందని ఐటీ మంత్రి చెప్పారన్న ఆయన.. కేసు మొదటి దశలోనే ఇద్దరికే ప్రమేయం ఉందని ఎలా చెప్తారని ప్రశ్నించారు. దర్యాప్తు విషయంలో ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదని వివరించారు. వ్యాపమ్ స్కామ్ తీర్పు ప్రతిని వివేక్ ధన్కా హైకోర్టుకు సమర్పించారు.