క‌రోనాపై తెలంగాణ ప్ర‌భుత్వానికి రాష్ట్ర హైకోర్టు కీల‌క ఆదేశాలు..!

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై రాష్ట్ర హైకోర్టు మంగ‌ళ‌వారం స‌మీక్షించింది. ఈ మేర‌కు కోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప‌లు ఆదేశాలు జారీ చేసింది. ఆగ‌స్టు 13వ తేదీన మ‌రోసారి చీఫ్ సెక్ర‌ట‌రీ, వైద్యాధికారులు కోర్టుకు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఐసీఎంఆర్‌, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టు సూచించింది. ప్ర‌తి రోజూ త‌ప్పులు లేకుండా కరోనా బులెటిన్ ఇవ్వాల‌ని, క‌రోనా స‌మాచారాన్ని ప్ర‌తి రోజూ ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాల‌ని సూచించింది.

కాగా కోర్టులో చీఫ్ సెక్ర‌ట‌రీ బ‌దులిస్తూ.. ఇప్ప‌టికే 875 హోట‌ల్ గ‌దుల్లో ఐసొలేష‌న్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. 248 మంది కోవిడ్ బాధితులు హోట‌ల్ గ‌దుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నార‌న్నారు. కాగా పేద‌వారి కోసం ఫంక్ష‌న్ హాళ్లు, క‌మ్యూనిటీ సెంట‌ర్లు, వెల్ఫేర్ అసోసియేష‌న్ సెంట‌ర్ల‌ను వాడుకోవాల‌ని హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించింది.

కోవిడ్ పేషెంట్ల‌ను హాస్పిట‌ల్‌లో చేర్చుకునే ప‌ద్థ‌తిని మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తామ‌ని సీఎస్ కోర్టుకు తెలిపారు. గ‌తంలో హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాల‌ను క‌చ్చితంగా అమ‌లు చేస్తామ‌న్నారు. ర్యాపిడ్ కిట్ల వాడ‌కంపై సీఎస్ కోర్టుకు ప‌లు విష‌యాలు తెలిపారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల ర్యాపిడ్ కిట్ల‌ను వాడుతున్నామ‌న్నారు. మ‌రో 4 ల‌క్ష‌ల కిట్ల‌కు ఆర్డ‌ర్ చేశామ‌ని తెలిపారు. ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో ఎంఆర్ఐ, సిటీ స్కాన్ టెస్టుల చార్జిల విష‌య‌మై హాస్పిట‌ల్స్ యాజ‌మాన్యాల‌తో చ‌ర్చిస్తున్నామ‌న్నారు.

క‌రోనా చికిత్స విష‌య‌మై ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని ప‌లు ప్ర‌యివేటు హాస్పిట‌ల్స్ వైద్యంపై 726 వ‌ర‌కు ఫిర్యాదులు అందాయ‌ని సీఎస్ కోర్టుకు తెలిపారు. స‌ద‌రు హాస్పిట‌ళ్ల‌కు ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చామ‌ని, కేసులు విచార‌ణ చేస్తున్నామ‌ని వివ‌రించారు. నిత్యం క‌రోనా స‌మాచారాన్ని ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాకు అందిస్తున్నామ‌ని, ప్ర‌తి హాస్పిట‌ల్ వ‌ద్ద డిస్‌ప్లే బోర్డుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో 21 నుంచి 50 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సున్న వారే ఎక్కువ‌గా క‌రోనా బారిన ప‌డుతున్నార‌ని అన్నారు. క‌రోనాను క‌ట్టడి చేసేందుకు అన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌న్నారు.

తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీ తెలిపిన వివ‌రాల‌ను సావ‌ధానంగా విన్న కోర్టు స్పందిస్తూ.. అన్ని చ‌ర్య‌లు అమ‌లు చేశాక తిరిగి పూర్తి నివేదిక‌తో కోర్టుకు రావాల‌ని సూచించింది. ర్యాపిడ్ కిట్ల‌తో రిజ‌ల్ట్ 40 శాతం మాత్ర‌మే క‌రెక్ట్ వ‌స్తుంద‌ని, ఈ విష‌యంపై దృష్టి సారించాల‌ని కోర్టు సూచించింది. రాజ‌స్థాన్‌లో ఇప్ప‌టికే స‌ద‌రు కిట్ల వాడ‌కాన్ని ఆపేశార‌ని పేర్కొంది. ర్యాపిడ్ కిట్ల వాడ‌కంపై నిపుణుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది. హైకోర్టు ఆదేశాల‌న్నింటినీ పూర్తిగా అమ‌లుచేశాక తిరిగి మ‌రోసారి పూర్తి నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 13వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version