దేశంలోనే తెలంగాణ రాష్ట్రం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక రంగాల్లో ముందంజలో నడుస్తోంది. ఇప్పుడు మరో విషయంలోనూ తన సత్తా చాటుకుంది. అదే వస్తు సేవల పన్ను జీఎస్‌టీ వసూళ్లు. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని తీసుకొచ్చిన తర్వాత గడిచిన నాలుగేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం జీఎస్‌టీ వసూళ్లలో 69 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం చూస్తే తెలంగాణ జీఎస్‌టీ ఆదాయం 2018-19లో రూ. 28,786 కోట్లుగాఉంది. ఇప్పుడు 2022-23 ఆర్థిక ఏడాదిలో అది రూ. 41,889 కోట్లకు చేరింది.
కోవిడ్ మహమ్మారి ప్రపంచం మొత్తం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తెలంగాణ GST వసూళ్లలో ఆశాజనక ధోరణిని కొనసాగించగలిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం GSTని ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణకు GST ఆదాయంలో రూ. 28,786 కోట్లు వచ్చాయి. తెలంగాణ బడ్జెట్ అంచనా రూ. 34 వేల 232 కోట్లుగా ఉండగా అందులో 84 శాతం సాధించింది. ప్రపంచమంతా మహమ్మారి ప్రతికూల ప్రభావంతో కొట్టుమిట్టాడుతుండగా, లాక్‌డౌన్‌ల సమయంలో కూడా తెలంగాణ తదుపరి సంవత్సరాల్లో వృద్ధి పథంలో కొనసాగింది.